ఈ ఆగస్టులో బాక్సాఫీసు దగ్గర రసవత్తరమైన పోటీ చూసే అవకాశం దక్కబోతోంది. ఓవైపు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ విడుదలకు రెడీ అయ్యింది. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో రజనీకాంత్ `కూలీ` కూడా రాబోతోంది. ఆగస్టు 15న ‘కూలీ’ని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన.
‘వార్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, హృతిక్ల కాంబో చూడడానికి దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పైగా ఆ ఫ్రాంచైజీకి వీర లెవిల్లో అభిమానులు ఉన్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఎలా చూసినా ‘వార్ 2’ బాక్సాఫీసుని షేక్ చేయడం తథ్యం. అలాగని ‘కూలీ’ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర ఇలా స్టార్ బలం బ్రహ్మాండంగా ఉంది. రజనీ సినిమా వస్తే సౌత్ లో ఆ హంగామా మామూలుగా ఉండదు. అయితే అదే సమయంలో ‘వార్ 2’ రావడం కూలీకి ఇబ్బందే. రెండూ పోటీ పడితే వసూళ్ల లెక్కల్లో తేడా వస్తుంది. ‘కూలీ’ హవా సౌత్ లో బాగా నడుస్తుంది. ఉత్తరాదిలో మాత్రం `కూలీ` నెగ్గుకు రావడం కష్టం అవుతుంది.
అందుకే రజనీకాంత్ కూడా విడుదల తేదీ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. కూలీ సోలోగా వస్తే బెటర్ అని, వార్ తో పోటీ వద్దని నిర్మాతకు సలహా ఇచ్చార్ట రజనీకాంత్. అసలే రజనీకాంత్ ఈమధ్య ఫామ్ లో లేరు. ఆయన మళ్లీ రేసులోకి రావాల్సిన అవసరం వుంది. అన్నింటికి మంచి ‘కూలీ’ భారీ బడ్జెట్ సినిమా. చిన్న పొరపాటు కూడా చేయకూడదు. అందుకే ‘వార్ 2’తో పోటీ లేకుండా సోలోగా విడుదల అయితే బాగుంటుందన్నది రజనీ ఉద్దేశం. రెండూ వేర్వేరు తేదీల్లో వస్తే, ఫ్యాన్స్కి కూడా బాగుంటుంది. సో.. బాక్సాఫీసు దగ్గర రజనీ, ఎన్టీఆర్ ‘వార్’ లేనట్టే.