రజనీకాంత్.. ఓ సూపర్ స్టార్! సౌతిండియాలో, ఆమాటకొస్తే భారతదేశం మొత్తంలతోనే స్టార్ డమ్లో రజనీని కొట్టే మొనగాడు లేడు. అలాంటి రజనీ సెట్లో ఎంత సాధారణంగా ఉంటారో, తోటి వాళ్లతో ఎంత సరదాగా జోకులు వేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఓసారి చిరంజీవి పేరు చెప్పి… కథానాయిక రంభని ఆడుకొన్నాడట రజనీ. ఆ విషయాన్ని రంభ ఇటీవలే.. బయటకు తీసుకొచ్చింది.
అరుణాచలం గుర్తుంది కదా? రజనీకాంత్, రంభ కలసి నటించిన చిత్రమిది. ఆ సినిమాకి సంబంధించి హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోందట. సరిగ్గా అప్పుడే ఓ దిన పత్రికకు రంభ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రచురితమైందట. అందులో తన అభిమాన కథానాయకుడు ఎవరంటే.. చిరంజీవి పేరు చెప్పిందట రంభ. ఆ పేపర్.. రజనీకాంత్ కూడా చదివాడట. అంతే… రంభ దగ్గరకు వచ్చి.. ”నీ ఫేవరెట్ స్టార్ చిరంజీవా.. అయితే తనతోనే యాక్ట్ చేయ్.. నన్ను అభిమానించే కథానాయికలు చాలామంది ఉన్నారు. వాళ్లనే హీరోయిన్లుగా పెట్టుకొంటా” అని సీరియస్ గా చెప్పివెళ్లిపోయాడట. దాంతో ఖంగుతినడం రంభ వంతైంది. `అదేంటి సార్ ఇలా అంటారు` అంటూ రంభ సర్ది చెప్పే ప్రయత్నం చేసిందట. కానీ.. రజనీకాంత్ వినలేదట. ఆరోజంతా ఇదే టాపిక్ చెప్పి.. రంభని ఏడిపించాడట రజనీ. సాయింత్రం అయ్యేసరికి సరదాగా నవ్వేసి ”ఇదంతా నిన్ను ఆటపట్టించడానికి చేశా.. ఏమీ అనుకోకు” అని చెప్పి వెళ్లిపోయాడట. ఇదీ… రజనీ స్పెషాలిటీ. ఈ విషయాన్ని రంభ.. చిరు దగ్గర ప్రస్తావించింది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రమోషన్లలో భాగం గా చిరుని ఇంటర్వ్యూ చేసింది రంభ. ఈ సందర్భంగా ఈ సరదా సంఘటనని గుర్తు చేసుకొంది.