తమిళనాడులో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత నుంచి అస్థిరత కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకేలో సరైన నాయకత్వం లేకపోవడం, దాన్లో రెండు వర్గాలు, శశికళ తెర వెనక రాజకీయాలు, దినకరన్ వర్గం ఎత్తులూ పైఎత్తులు, క్యాంపు రాజకీయాలు, వీటికితోడు పై నుంచి భాజపా వ్యూహాలు… కొన్నాళ్లుగా తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల తమిళ ప్రజలు కూడా ఏమంత సంతృప్తిగా లేరు. బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా 2 జీ కుంభకోణం కేసు నుంచి కనిమొళి, రాజాలు బయటపడటం… కరుణానిధి పట్ల భాజపా సానుకూల వైఖరితో వ్యవహరిస్తోందా అన్నట్టుగా ప్రధాని మోడీ ఆయన్ని కలవడం… ఇలా చాలా రకాల పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఆమధ్య కమల్ హాసన్ పార్టీ పెడతా అంటూ కొంత హడావుడి చేశారు. ఇప్పుడు కొంత సైలెంట్ అయ్యారు. నిజానికి, కమల్ కంటే ముందు నుంచే రజనీకాంత్ కూడా పార్టీ పెడతారూ, రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అదిగోఇదిగో అంటూ చర్చ జరగడమే తప్ప, స్పష్టతమైన ప్రకటన అంటూ ఇంతవరకూ లేదు. ఆ మధ్య రజనీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. అదీలేదు. ఇప్పటికే ఒక టీమ్ పార్టీ ఏర్పాట్లపై దృష్టి పెట్టిందంటూ ఎప్పట్నుంచో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి అభిమానులతో తలైవా సమావేశం కాబోతున్నారు.
ఈనెల 26 నుంచి 31 వరకూ సమావేశాలు నిర్వహించేందుకు తలైవా సిద్ధమౌతున్నారు.జిల్లాలవారీగా అభిమానులను రజనీ పిలిపించుకుని, వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారని మణియన్ ప్రకటించారు. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వ్యూహరచన కోసమే తాజాగా ఓ సమావేశం జరిగింది. అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరగడంతో.. మరోసారి ఆసక్తి పెరిగింది. అనంతరం మణియన్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అనే అనుమానం వద్దనీ, అన్ని ప్రశ్నలకూ త్వరలోనే సమాధానాలు వస్తాయని ముక్తసరిగా చెప్పేసి వెళ్లిపోయారు! అంటే, పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఈసారి కచ్చితంగా ఏదో ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుందని మణియన్ చెప్పకనే చెబుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
కనీసం ఇప్పటికైనా రజనీకాంత్ పార్టీ ప్రకటిస్తే బాగుండు అనే అభిప్రాయం చాలామందికి ఉంది. నిజానికి, రజనీ సాహసం చేసేందుకు ఇదే సరైన సమయం. ఈ నాలుగు రోజులూ ఇదే అంశంపై చర్చలు ఉంటాయనీ, పార్టీ అజెండా ఖరారు చేసేందుకే అభిమానుల సూచనలు తీసుకుంటారని ఈసారి కాస్త బలంగానే వినిపిస్తోంది. మరి, ఈసరైనా తలైవా తెగించి ప్రకటన చేస్తారా..? లేదంటే, గతంలో మాదిరిగా కొన్ని కథనాలు, కొంత చర్చకు మాత్రమే తావు ఇచ్చి, మళ్లీ వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోతారా అనేది వేచి చూడాలి.