సూపర్ స్టార్ రజనీకాంత్.. పార్టీ పెడుతున్నారు. ఒక గాలి వీస్తే ఆయన పార్టీ తమిళనాడును దున్నేస్తుంది. రజనీ సీఎం అయిపోతారు. కానీ.. రజనీకాంత్ తాను సీఎం అవుతానని చెప్పడం లేదు. యువకుడిని సీఎంను చేస్తానని చెబుతున్నారు. రజనీ ప్రకటనలు చూస్తే… కేసీఆర్ దళిత సీఎం స్టేట్మెంట్ సహజంగానే అందరికీ గుర్తుకు వస్తుంది. రజనీకాంత్ ప్రకటన వెనుక కూడా అలాంటి వ్యూహం ఉందని అంటున్నారు. 70 ఏళ్ల వయసులో రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇప్పటికే తమిళనాడులో చర్చనీయాంశం అయింది. ఆయనకు వయస్సు మీద పడటంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.
పార్టీ పెడతానని ప్రకటన చేసే సమయంలో కూడా ప్రజలతో మమేకమౌదామంటే కరోనాతో పాటు తనకు ఆరోగ్యం సహకరించలేదని చెప్పారు. అప్పుడే గెలిస్తే ఇక ప్రజలకు ఏం సేవ చేస్తారన్న ప్రశ్నలు రావడం ప్రారంభించాయి. రజనీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అనుమానమేనని చర్చించుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఇంతకాలం జాప్యం జరిగింది. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి తలైవా..ఒక అడుగు ముందుకేస్తే..రెండు అడుగులు వెనక్కి వేస్తూ వచ్చారు. ఇప్పుడు దూకుడు పెంచడం చూస్తే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం వెనుక వ్యూహామేమైనా ఉందనే అభిప్రాయానికి వస్తున్నారు.
రజనీకాంత్ పార్టీ గెలిస్తే.. వేరే యువకుడ్ని సీఎం చేయడానికి ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. జనం కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా తలైవానే సీఎం అవ్వాలి. అందులో సందేహం ఉండదు. మరి యువ సీఎం వాదన ఎందుకు తెచ్చారు..? అంటే… తాను యాక్టివ్గా ఉండలేనని చెప్పడానికేనని అంటున్నారు. మొత్తానికి తలైవా.. అప్పుడే రాజకీయం ఒంటబట్టించుకున్నారన్న చర్చ తమిళనాడులో నడుస్తోంది.