ఆ ఇద్దరు హీరోలు దాదాపు ఒకేసారి సినిమాల్లోకి వచ్చారు. కలసి సినిమాల్లో నటించారు. కాలక్రమంలో తమ అభిరుచి, ఇమేజ్‌ల ఆధారంగా పాత్రల ఎంపికల్లో వేర్వేరు ప్రాధాన్యాలతో తమదైన మార్గం ఎంచుకున్నారు. పెద్ద హీరోలుగా ఎదిగారు. ఒకరు కోట్లాది మంది అభిమానులకు దేవుడిగా మారి, బాక్సాఫీస్ రికార్డులకు చిరునామాగా నిలిస్తే మరొకరు వైవిధ్యభరిత పాత్రల పోషణకు, నటనకు దేశంలోనే కేరాఫ్‌గా పేరు దక్కించుకున్నారు.
అటువంటి ఆ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఒకేసారి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయనున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్‌లు ప్రస్తుతం రాజకీయ పార్టీల సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బహుశా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇద్దరు టాప్ హీరోలు ఒకే సమయంలో పార్టీలు పెడుతూ పొలిటికల్ గంట మోగిస్తూండడంతో అది అటు సినీ-రాజకీయ వర్గాల్లో, సామాన్య జనంలో కూడా ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఈ నేపధ్యంలోనే ఆదివారం కమల్ హాసన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకున్నారు. చెన్నైలోని పొయస్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ హీరోల కలయిక తమిళనాట రాజకీయాల్లో ఆసక్తి రేపింది. గతంలో తాను రజనీని కలిసేది లేదని స్పష్టం చేసిన కమల్… అనూహ్యంగా రజనీని కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తన ప్రాణ మిత్రుడైన రజనీని కలవడానికే తాను వచ్చానని కమల్ ఈ సందర్భంగా చెప్పాడు. ఈ నెల 21న పార్టీని ప్రకటించబోతున్న కమల్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు రజనీ. సినిమాల్లో తామిద్దరు పయనించిన దారులు వేర్వేరు అని అలాగే రాజకీయాల్లోనూ అయినప్పటికీ… తమ ఇద్దరి లక్ష్యం మాత్రం ప్రజలకు మేలు చేయడమేనని రజనీ అన్నాడు. అయితే తామిద్దరం కలసి రాజకీయంగా ప్రయాణించడం అనేది కాలం నిర్ణయిస్తుందని స్పష్టం చేశాడు.