ఎన్నో ఆశలు పెట్టుకొన్న కబాలి విడుదలైంది. బాక్సాఫీసు దగ్గర అప్పుడే డివైడ్ టాక్ మొదలైంది. ఈ సినిమా చూసి నొసలు చిట్లిస్తున్నవాళ్లే ఎక్కువ. సినిమా మొత్తం ఎలాగున్నా… క్లయిమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కబాలి హ్యపీ ఎండింగ్ అనుకొంటున్న సమయంలో టైగర్ అనే పాత్రధారి ఎంటరై.. గన్ గురిపెడతాడు. వెంటనే స్క్రీన్ మొత్తం నల్లగా మారిపోయింది. పిస్తోలు శబ్దాలు వినిపిస్తాయి. అంటే అక్కడ కాల్పులు జరిగాయన్నమాట. అయితే ఎవరు ఎవరిని కాల్చారు? ఎందుకు అన్నది సస్పెన్స్ అన్నమాట. అంటే.. పార్ట్ 2 కోసం దర్శకుడు రంజిత్ ఇక్కడే తన గేమ్ స్టార్ట్ చేశాడన్నమాట.
కబాలి క్లయిమాక్స్ గురించి అంతకు ముందు రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇది శాడ్ ఎండింగ్ అని, చివర్లో రజనీకాంత్ చనిపోతాడని చెప్పుకొన్నారు. ఆ లెక్కన టైగర్ కాల్పులు జరిపింది కబాలిపైనే అన్నమాట. ఈ సినిమా హిట్టయితే పార్ట్ 2 కథ అక్కడి నుంచే మొదలయ్యేదేమో? ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు లెండి.