కబాలి ఫీవర్ సౌతిండియా మొత్తం పాకేసింది. కబాలి ఫస్ట్ లుక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో… అప్పటి నుంచీ కబాలి కబాలి అంటూ కలవరిస్తున్నారంతా. టీజర్లో రజనీ విన్యాసాలు చూశాక ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. బిజినెస్ పరంగా రజనీకాంత్ గత రికార్డుల్ని తిరగరాస్తోంది కబాలి. తెలుగులో రూ.32 కోట్లకు ఈ సినిమా కొనేశారు. రోబోని మించిన ధర ఇది. అంతా బాగానే ఉంది.. కానీ కబాలిని నమ్మొచ్చా?? అన్నదే అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే ఈమధ్య భారీ అంచనాల మధ్య విడుదలైన ఏ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు కబాలినీ ఆ యాంటీ సెంటిమెంట్ కబళించేస్తుందేమో అని భయపడుతున్నారంతా.
పైగా రంజిత్ పాకి దర్శకుడిగా పెద్దగా అనుభవం లేదు. తీసిన రెండు సినిమాలూ బాగా ఆడాయి. అయితే అందులో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. తన సినిమాలో తమిళ నేటివిటీ బాగా దట్టించడం రంజిత్ అలవాటు. తమిళ నేటివిటీ మరీ ఎక్కువ ఉంటే… అలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కవు. పైగా ఇది బాషా టైపు సినిమా అంటున్నారు. బాషా విడుదలయ్యాక అలాంటి చిత్రాలు వందల సంఖ్యలో వచ్చాయి. మళ్లీ అదే పేట్రన్లో కబాలి సాగితే… జనాలకు బోర్ కొట్టక మానదు. ఈ యాంటి సెంటిమెంట్స్ ఈ సినిమా విషయంలో వర్కవుట్ అవ్వకూడదని ప్రేక్షకాభిమానులు కోరుకొంటున్నారు. కబాలి రికార్డుల మోత మోగించాలన్నది అందరి అభిలాష. మనమూ అదే కోరుకొందాం.