దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉన్న రాజీవ్ ఖేల్ రత్న పేరును కేంద్రం మార్చేసింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా ఆ పురస్కారం పేరును మార్చేసింది. ఒలింపిక్స్ హాకీలో భారత పురషుల జట్టు కాంస్యం గెల్చుకోవడం.. మహిళల జట్టు చివరి వరకూ పోరాడటం ప్రధానమంత్రి మోడీని బాగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఖేల్ రత్న పురస్కారానికి రాజీవ్ పేరు తీసేసి.. ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని నిర్ణయంచారు. ఆ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేసేశారు.
ఈ నిర్ణయం భిన్నాభిప్రాయాలకు కారణం అవుతోంది. కారణం.. రాజీవ్ పేరును తొలగించడమే. రాజీవ్ పేరును తొలగించడానికే.. సమయం .. సందర్భం చూసుకుని నరేంద్రమోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దేశానికి ఎన్నో సేవలు అందించిన రాజీవ్ గాంధీ తన ప్రాణాన్ని సైతం అర్పించారని అలాంటి మహనీయుడిపేరను తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే.. ధ్యాన్ చంద్ పేరుతో మరో పురస్కారం పెట్టుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం.. రాజీవ్ పేరును మళ్లీ పెట్టాలనే ఆలోచన చేయడం లేదు.
నిజానికి ధ్యాన్ చంద్ జయంతిని జాతీయక్రీడా దినోత్సవంగా పాటిస్తారు. హాకీలో ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడిగా ధ్యాన్ చంద్‌కు గుర్తింపు ఉంది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నా.. రాజకీయ సమీకరణాల పరంగా పెద్దగా ఉపయోగం లేదనుకుంటారేమో కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ధ్యాన్‌చంద్ పేరును ఖేల్ రత్న అవార్డుకు పెట్టడానికి కారణం రాజకీయమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజానికి హాకీ టీం మెరుగైన ప్రదర్శన చేయడానికి కేంద్రం చేసిన సాయం ఏమీ లేదు. కానీ ఒడిషా ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున సాయం చేసింది. స్పాన్సర్ షిప్ నుంచి సహారా వైదొలిగినప్పుడు.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తరపున స్పాన్సర్ షిప్ ఇచ్చారు. దీని వల్లే ఆ ఆట మనగలుగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం… హాకీ జట్ల విజయాల్ని రాజకీయానికి వాడేసుకుంటోందన్న విమర్శలు మాత్రం ఎదుర్కొంటోంది.