మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కెసిఆర్పట్ల మరీ అనుకూలంగా వ్యవహరించడం వల్లనే పదవి కోల్పోయారని ఒక కథనం. కాదు అంతకు ముందే ఆయనపై ఆరోపణలు వున్నాయని వాటిపై ముందే హెచ్చరించి తొలగింపు వుంటుందని స్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా దత్తన్నకూ రాష్ట్ర ప్రభుత్వానికి లంకె ఒక ప్రతికూలాంశమైందనేది నిస్సందేహం. అయితే విచిత్రంగా ఇప్పుడు రాజకీయ వర్గాలు మరో మంత్రి కూడా టిఆర్ఎస్ వల్లనే పదవి కోల్పోయారని చెప్పుకుంటున్నారు. ప్రతాప్ సింగ్ రూడీ తొలగింపునకు కారణం ఎంపి కవిత సంస్థలకు సహాయం చేయడమేనని, ఆమెకు సహాయం చేయడం వల్లనే ప్రధాని మోడీ తప్పించారని ఒక కథనం వినిపిస్తుంది. జాగృతి సంస్థకు స్కిల్ డెవలప్మెంట్ కింద మామూలుకన్నా చాలా ఎక్కువగా మంజూరు చేయించారన్నది ఈ వర్గాల వాదన. నిజానిజాలు చెప్పగలిగింది మోడీ ఒక్కరే. ఆయన నిశ్శబ్దంగా మార్పులు చేర్పులు చేశారు గనక ఏమీ చెప్పడమనే సమస్య లేదు. అయితే మామూలుగానే కాస్త రాజవైభోగం వెలగబెట్టే రూడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఫలక్నుమా ప్యాలెస్లో వుండటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసేదట. ఇది కూడా ఆయన వ్యతిరేకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.