తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… లోక్సభ టిక్కెట్లపై కసరత్తు చేస్తున్నారు. ఆయనకు బాగా నమ్మకస్తులైన వారిని.. ఈ సీట్లకు ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా… తెరపైకి వచ్చిన ఓ పేరు కలకలం రేపుతోంది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను..మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ బరిలో నిలపాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి .. రిటైరైన తర్వా… ప్రధాన సలహాదారు పదవిలో కొనసాగుతూ… ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్నారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల వ్యూహంలో రాజీవ్ శర్మ కీలకంగా వ్యవహరించారు. అందుకే.. ఆయనకు లోక్సభ టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మల్కాజిగిరి నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా … టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దాంతో కొత్త అభ్యర్థిని పెట్టడం ఖాయమే. మల్కాజ్ గిరి పరిధిలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎల్బీనగర్ మినహా మిగతా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ గెలుపు ఖాయమన్న ధీమా టీఆర్ఎస్లో ఉంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లతో పాటు ఉత్తర భారతం నుంచి వచ్చి సెటిలైన వారూ అధికంగా ఉన్నారు. అందుకే రాజీవ్ శర్మ అయితే.. సరైన అభ్యర్థి అని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది. కేసీఆర్ అనుకుంటేనే.. మీడియాకు సమాచారం వస్తుంది. అలా అనుకున్నారు కాబట్టే.. ఈ విషయం బయటకు వచ్చింది. కాబట్టి.. ఆయనకు టిక్కెట్ ఖాయమని తేలిపోతోంది.
అయితే మల్కాజిగిరి టిక్కెట్ కోసం.. టీఆర్ఎస్లో చాలా ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలా చారి, మేయర్ బొంతు రామ్మోహన్ , మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా టిక్కెట్ అడుగుతున్నారు. కానీ రాజీవ్ శర్మ రేసులోకి వచ్చి.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉంటే మాత్రం.. ఆయనకే టిక్కెట్ ఖరారు అవ్వొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.