టిట్లి తుపానుతో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం అతలాకుతలమయింది. దీని తీవ్ర హుదూద్ కన్నా ఎక్కువగా ఉందని.. కేంద్రానికి కూడా సమాచారం ఉండటంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… తుపాను వచ్చిన రోజు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు. చంద్రబాబు కూడా పరిస్థితి చెప్పి.. సాయం చేయాలని అడిగారు. ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఉద్దానంలో.. సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం తీరిక లేకుండా ఉంది. అందుబాటులో ఉన్న వనరులతో ప్రకృతి విలయం బారిన పడిన వారికి సాయం చేస్తోంది.
ఈ తరుణంలో కేంద్రం నెంబర్ టూ లాంటి పొజిషన్ లో ఉన్న హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీకి వచ్చారు. ప్రస్తుతం ఎపీలో ఉన్న సమస్యను ఎదుర్కోవడానికి ఆయనేమైనా సాయం తీసుకొస్తారేమో అనుకుంటే.. అలాంటి ఆలోచనే ఆయన పెట్టుకోలేదు. వచ్చింది పార్టీ ఆఫీసు కార్యక్రమానికి కాబట్టి.. శంకుస్థాపన చేసి.. రాజకీయ విమర్శలు చేశారు. ఏపీకి కేంద్రం ఎంతో చేసిందని.. రూ. వెయ్యి, పదిహేను వందల కోట్లనే ఘనంగా చెప్పుకున్నారు. తుపానుసాయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. దీంతో రాజ్ నాథ్ సింగ్.. తిరిగి ఢిల్లీకి వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో…మంత్రులు, టీడీపీ ఎంపీలు కలిశారు. రెండు వినతి పత్రాలు అందజేశారు. విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశంపై ఓ వినతిపత్రం, తితలీ తుపాను తీవ్రత, తుపాను సాయంపై చంద్రబాబు రాసిన మరో లేఖను.. అందించారు. తితలీ తుపాన్ వల్ల రూ. . 3435 కోట్ల నష్టం జరిగిందన్న చంద్రబాబు లేఖలో వివరించారు.
తక్షణం రూ. 1200 కోట్ల సాయం అందివ్వాలని మరోసారి లేఖలో విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రూ. 500 కోట్లు ఖర్చు పెట్టామని తక్షణ సాయం కింద కేంద్రం ..రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. తితలీ తుపానుపై ప్రధాని మోదీ ఆరా తీశారు కానీ…
నష్టం అంచనాకు కేంద్ర బృందాలు రావడం లేదుని మంత్రి దేవినేని విమర్శించారు. శ్రీకాకుళంలో మంత్రి రాజ్ నాథ్ పర్యటనపై స్పందించిన చంద్రబాబు.. రాజకీయాల కోసం వచ్చారు కానీ… సాయం చేయడానికి రాలేదని విమర్శలు గుప్పించారు. బీజేపీ తీరే అంత అన్నట్లుగా మండిపడ్డారు.