పఠాన్ కోట్ దాడుల దర్యాప్తు కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జిట్) ని పఠాన్ కోట్ లో దర్యాప్తు చేయడానికి మోడీ ప్రభుత్వం అనుమతించినందుకు కాంగ్రెస్, ఆమాద్మీ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా విమర్శిస్తుంటే, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం అది తమ ప్రభుత్వం సాధించిన చాలా గొప్ప దౌత్య విజయం అన్నట్లుగా చెప్పుకోవడం విశేషం.
“ఇంతవరకు భారత్ లో ఎప్పుడు పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడినా వాటితో తనకు ఎటువంటి సంబంధమూ లేదని పాక్ ప్రభుత్వం వాదిస్తుండేది కానీ పఠాన్ కోట్ దాడుల విషయంలో పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా తన తప్పును అంగీకరించింది. పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జిట్’ ని భారత్ కి పంపడం ద్వారా దానిని మరొకసారి దృవీకరించినట్లయింది. ఇప్పుడు భారత్ దర్యాప్తు బృందం కూడా పాకిస్తాన్ పర్యటించి ఈకేసుపై అక్కడ దర్యాప్తు చేస్తుంది. ఈ పరిణామాలని పాకిస్తాన్ పై మా ప్రభుత్వం సాధించిన దౌత్య విజయంగానే చూడవలసి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడి తెలివితేటలకి, సానుకూల రాజకీయ చతురతకి ఇవి అద్దం పడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ చాలా శక్తివంతంగా తయారయిందని చెప్పుకొంటున్నాయి. అంతర్జాతీయంగా భారత్ యొక్క ప్రాధాన్యతను మోడీ పెంచేవిధంగా పావులు కదుపుతుండటం వలననే ఇది సాధ్యం అయ్యింది,” అని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియాతో అన్నారు.
పఠాన్ కోట్ పై దాడులకు కుట్ర పన్నినవారి జాబితాను భారత్ పాక్ ప్రభుత్వానికి అందజేసి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. కానీ ప్రపంచ దేశాలతో సహా భారత్ ని కూడా మభ్యపెట్టేందుకు ఒక జిట్ ని ఏర్పాటు చేసింది. అది కొండను తవ్వి ఎలుకని పట్టినట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలోనే చాలా స్వేచ్చగా తిరుగుతున్న జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ని గృహ నిర్బంధంలో ఉంచింది. కానీ పనిలోపనిగా అతను ఈ కుట్రకు పాల్పడినట్లుగా ఎటువంటి ఆధారాలు కనుగొనలేకపోయామని ప్రకటించి అతనికి ‘క్లీన్ చిట్’ ఇచ్చేసి చేతులు దులుపుకొంది. అంటే దానికి ఎవరినీ పట్టుకొనే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది.
పాక్ ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద మహా సామ్రాజ్యంగా మారిందనే సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ సంగతి పాకిస్తాన్ కి కూడా తెలుసు. కనుక పఠాన్ కోట్ దాడులకు తమ గడ్డపైనే కుట్రలు జరిగాయని అంగీకరించడం వలన పాకిస్తాన్ కి కొత్తగా వచ్చే నష్టం, అపవాదు ఏమీ ఉండవు కనుకనే దీనిని కూడా ఒక మంచి అవకాశంగా మలుచుకొనేందుకు జిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు వంకతో భారత్ కి అత్యంత కీలకమయిన, వ్యూహాత్మకమయిన ఎయిర్ బేస్ ని స్వయంగా పరిశీలించి రావడానికి తన గూడచారి సంస్థల ప్రతినిధులని పంపించింది. వారికి భారత్ ఎర్రచందనం స్మగ్లింగ్ తివాచీ పరిచి స్వాగతం పలికింది. అదే తమ ప్రభుత్వ దౌత్య విజయం అని, తెలివితేటలకి నిదర్శనమని గర్వంగా జబ్బలు చరుచుకొంటోంది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టకుండా ఇటువంటి నాటకాలు ఆడుతుంటే, జిట్ ఏర్పాటు చేసి దానిని భారత్ పంపినందుకే మోడీ ప్రభుత్వం సంతోషిస్తోందంటే అల్ప సంతోషి అని అనుకోవాలి.
జిట్ బృందం పఠాన్ కోట్ లో పర్యటిస్తున్న సమయంలోనే భారత్ కి చెందిన కుల్భూషన్ యాదవ్ అనే మాజీ నేవీ అధికారిని అరెస్ట్ చేసి అతని చేత “తను పాకిస్తాన్ లో విద్వంసం సృష్టించేందుకు భారత నిఘా సంస్థ రా పంపిన వ్యక్తినని వీడియో ప్రకటన ఇప్పించి, దానిని మీడియాకి విడుదల చేసింది.
పాక్ తీరు ‘మీ ఇంటికి వస్తే ఏమిస్తావు..మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు?’ అన్నట్లుంటుంది. జిట్ బృందం పఠాన్ కోట్ లో దర్యాప్తు పేరిట పర్యటించడం ద్వారా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ భౌగోళిక స్థితిగతుల గురించి దాని గూడచార ప్రతినిదులకి ఎంతో కొంత అవగాహన పెంచుకోగాలిగారు. ఇప్పుడు భారత్ బృందం పాక్ లో పర్యటిస్తే, అప్పుడు భారత్ ని ఏదోవిధంగా అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేయవచ్చును. బహుశః కుల్భూషన్ యాదవ్ కధని అందుకే సిద్దం చేసిపెట్టుకొన్నట్లుంది.
పాక్ దుర్బుద్ధిని అర్ధం చేసుకొని అది ఆడుతున్న ఈ కపట నాటకాలను మోడీ ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది కానీ ఇంత జరిగిన తరువాత కూడా భారత్ దర్యాప్తు బృందం పాకిస్తాన్ వెళ్లి దర్యాప్తు చేస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించడం చాలా విస్మయం కలిగిస్తోంది.