ఓంకార్ సినిమా రాజుగారి గది.. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. రూ.3 కోట్లతో పూర్తయిన ఈ చిత్రం దాదాపు రూ.9 కోట్ల వరకూ వసూళ్లు దక్కించుకొంది. ఈసినిమాకి సీక్వెల్ చేయాలన్నది ఓంకార్ ఆలోచన. స్క్రిప్టు కూడా సిద్ధమైంది. ఓ తమిళ హీరోకి వినిపించి డేట్లు తీసుకొందామనుకొన్నాడు ఓంకార్. తమిళ హీరో అయితే ఈ సినిమాని తమిళంలోనూ మార్కెట్ వస్తుందని భావించాడట. అయితే ఇప్పుడు ఆ కథ వెంకటేష్ దగ్గరకు చేరింది. రాజుగారి గది సినిమాని చూసిన వెంకీ.. ఓంకార్‌ని పిలిపించుకొని ‘ఓ కథ ఉంటే చెప్పు…’ అని ఆఫర్ ఇచ్చినట్టు టాక్. రాజుగారి గది 2 కథని వెంకీకి ఓంకార్ చెప్పాడని, దానికి వెంకీ బాగా కనెక్ట్ అయిపోయాడని తెలుస్తోంది.
వెంకీ సినిమా బాబు బంగారం ఆగస్టు 12న విడుదల అవుతుంది. ఆ తరవాత సాలా ఖుద్దూస్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఆసినిమాకి మూడు నెల్లలో పూర్తి చేయాలన్నది వెంకీ ఆలోచన. ఆ వెంటనే రాజుగారి గది 2 సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. ఓ హారర్సినిమాలో వెంకీ నటించడం ఇదే తొలిసారి. టాలీవుడ్ లోని అగ్రహీరో.. హారర్ సినిమాలో నటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. హారర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా… పెద్ద హీరోలు సైతం ఈ జోనర్లో సినిమాలు చేయడానికి మొగ్గు చూపడం విచిత్రమే మరి.