చంద్రముఖి ప్రభావం హారర్, థ్రిల్లర్ సినిమాలపై చాలా ఉంది. ఏ సినిమా చూసినా చంద్రముఖి రిఫరెన్సులు దొరికేస్తుంటాయి. ప్రస్తుతం రాజుగారి గది 2లోనూ చంద్రముఖి పోలికలు కనిపిస్తున్నాయి. నాగార్జున, సమంత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. సమంత ఆత్మలా కనిపిస్తే, ఆ ఆత్మ ని పట్టడానికి వచ్చే వ్యక్తిగా నాగ్ నటించాడు. ఓ బంగ్లాలో ఆత్మ తిరగడం, తన తెలివితేటలతో… ఆ ఆత్మని హీరో బంధించడం, అక్కడి సమస్యని పరిష్కరించడం అనే లైన్.. ఈ సినిమా కథలోనూ కనిపిస్తోంది. కాకపోతే… రాజుగారి గది 2లో కామెడీ పండే స్కోప్ ఎక్కువగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, షలకల శంకర్, ప్రవీణ్‌లు ఆ బాధ్యత తీసుకొన్నారు. ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని.. హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకొంటోంది. ఆత్మకు వినాశనం లేదు.. అనే భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ మొదలైంది.. మధ్యలో కొన్ని కామెడీ బిట్లు, నాగ్ ఎంట్రీ, ఆత్మగా సమంత రూపం గాలిలో కలసిపోవడం, పెయింట్లోంచి సమంత బొమ్మ మాయం అవ్వడం, చివర్లో థ్రిల్లింగ్ బిట్… ఇవన్నీ కలిసి పర్ఫెక్ట్ హారర్, కామెడీ సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ రాజుగారి గది 2లో ఉన్నాయన్న భరోసా ఇచ్చింది. అక్టోబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.