రాజకీయాల్లో పవన్ తన మొదటి సహచరుల్ని ఒక్కొక్కరుగా కోల్పోతున్నారు. తాజాగా.. ఆయన తన రాజకీయ భావాలు పెంపొందించుకోవడానికి పిల్లర్‌గా ఉపయోగపడిన రాజురవితేజను దూరం చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ, సామాజిక అధికారం దక్కించుకోవడానికి అనర్హుడని.. రాజకీయాలకు పనికిరాడని రాజురవితేజ సంచలన ప్రకటన చేశారు. ఉన్నత భావాలతో రాజకీయ పార్టీని ప్రారంభించిన పవన్ ఇప్పుడు రాజకీయ విధ్వంసకర శక్తిగా.. కుల, మత రాజకీయాలకు పాల్పడే నేతగా మారిపోయారన్నారు. రాజకీయాలకు పవన్ కల్యాణ్ ప్రమాదకరంగా మారాడని.. రాజురవితేజ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు పవన్ కల్యాణ్‌తో పని చేయబోనని ప్రకటించారు.
రాజురవితేజ… జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పరిచయమైన వ్యక్తి. తాను రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రేరణ ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రాజురవితేజ అని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పారు. పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి రాజురవితేజ ఆయనతోనే ఉన్నారు. జనసేన పార్టీ రాజ్యాంగం అయిన పవనిజం పుస్తకాన్ని ఆయన రాశారు. ప్రస్తుతం రాజురవితేజ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. ఎక్కువగా తెర వెనుక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే రాజురవితేజ.. ఒక్క సారిగా పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసి.. పార్టీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. రాజురవితేజ.. తీవ్ర అసంతృప్తికి గురై..మరోసారి పవన్ కల్యాణ్ మొహం చూడనని.. ఆయనతో కలవనని ప్రకటించడమే కాదు.. పవన్ కల్యాణ్ అసలు రాజకీయాలకు పనికి రాడంటూ.. లేఖ రాయడం… ఇప్పుడు.. జనసేన పార్టీలోనే కలకలం రేపుతోంది.
పవన్‌ని అమితంగా ఆరాధించే రాజురవితేజ.. అంత కంటే ఎక్కువ స్థాయిలో ద్వేషించడానికి కారణం.. పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా ఉండటమేనని చెబుతున్నారు. రాజురవితేజ రాసిన లేఖలోని అంశాలు అలాగే ఉన్నాయి. కుల, మత విభజన రాజకీయాలకు పవన్ కల్యాణ్ పాల్పడుతున్నారని.. రాజురవితేజ ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో… జగన్ పై మత పరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి రహస్య చర్చలు జరిపి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాజురవితేజ అవే ఆరోపణలు చేసి.. పవన్ రాజకీయ పయనాన్ని తప్పు పడుతూ వైదొలిగారు. పవన్ పార్టీ పెట్టినప్పుడు… రాజురవితేజ, ట్రెజరర్ రాఘవయ్య మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఇతరులు వచ్చి చేరారు. వీరు దూరమయ్యారు.