Pratinidhi 2 movie review
తెలుగు360 రేటింగ్ 1.5/5
-అన్వర్
హాస్య నటులందరికీ ఎప్పుడో ఒకప్పుడు ‘హీరో’ అయిపోవాలన్న కోరిక కలుగుతుంది. అది సహజం. చాలామంది కమెడియన్లు హీరోలుగా అవతారం ఎత్తింది అందుకే. ఈ వరుసలో గెటప్ శ్రీను కూడా చేరిపోయాడు. జబర్దస్త్ వల్ల బుల్లి తెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకొన్నాడు శ్రీను. కొన్ని సినిమాల్లోనూ మెరిశాడు. ఇప్పుడు ‘రాజు యాదవ్’తో హీరోగా మారాడు. గెటప్ శ్రీను సినిమా కావడం, రెండు పాటలు బాగా క్లిక్ అవ్వడం వల్ల ‘రాజు యాదవ్’పై కాస్త ఫోకస్ పడింది. మరి ఈ ‘రాజు యాదవ్’ ఎలా ఉన్నాడు. బుల్లి తెరపై విజృంభించే గెటప్ శ్రీను… వెండి తెరపైనా రాణించాడా?
రాజు యాదవ్ (గెటప్ శ్రీను)ది మహబూబ్ నగర్. పక్కా మిడిల్ క్లాస్. డిగ్రీ తప్పి, ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. క్రికెట్ బంతి మొహానికి తగలడం వల్ల ఓ వింత సమస్య వెంబడిస్తుంటుంది. ఆనందమైనా, సంతోషమైనా, బాధైనా, ఎలాంటి ఫీలింగ్ అయినా.. మొహంపై నవ్వు అలానే ఉంటుంది. ఆపరేషన్ చేయాలంటే రూ.4 లక్షలు కావాలి. తండ్రి పైసా కూడా ఇవ్వనంటాడు. ఇంతలో స్నేహితుడొకడు గొప్పింటి పిల్లని ప్రేమించి సెటిలైపోతాడు. తనని ఆదర్శంగా తీసుకొని ఆస్తిపాస్తులున్న ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని, తాను కూడా లైఫ్‌లో సెలిటైపోవాలని భావిస్తాడు. ఆ క్రమంలోనే స్వీటీ (అంకిత ఖారత్)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. తన వెంటే తిరుగుతుంటాడు. కానీ స్వీటీ మాత్రం రాజుని అస్సలు పట్టించుకోదు. స్వీటీకి ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోతుంది. రాజు కూడా హైదరాబాద్ ప్రయాణం అవుతాడు. మరి రాజు హైదరాబాద్ లో ఏం చేశాడు? స్వీటీ ప్రేమని పొందాడా, లేదా? ఈ ప్రేమ కథ చివరికి ఏ తీరానికి చేరింది? అనేది మిగిలిన కథ.
కమెడియన్లు హీరోలుగా మారినప్పుడు స్వతహాగానే ఓ తప్పు చేస్తుంటారు. తొలి సినిమాతోనే అచ్చమైన మాస్ హీరోలా మారిపోవాలన్న తాపత్రయంతో తమకు మ్యాచ్ అవ్వని కథల్ని ఎంచుకొంటారు. అయితే గెటప్ శ్రీను ఆ తప్పు చేయలేదు. ఈ కథలో గెటప్ శ్రీనుని హీరోగా చూడం. ఓ పాత్రగానే భావిస్తాం. అంత వరకూ గెటప్ శ్రీను మంచి పనే చేశాడు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో బ్రహ్మానందం ట్రాక్ ఒకటి ఉంటుంది. చావు వార్త కూడా నవ్వుతూనే చెబుతాడు. ఆ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అదే ట్రాక్‌ని పూర్తి స్థాయి సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో.. అదే ‘రాజు యాదవ్’. ఇలాంటి ట్రాక్‌లు జబర్దస్త్ ఎపిసోడ్ వరకూ ‘పాస్’ అయిపోవడానికి బాగుంటాయి. దాన్నే నమ్ముకొని రెండు గంటల సినిమా తీయాలంటే చాలా కష్టం. దర్శకుడు ఏదో ఓ మ్యాజిక్ చేస్తే కానీ, అది వర్కవుట్ అవ్వదు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాజిక్ ‘రాజు యాదవ్‌లో’ జరగలేదు. తొలి పది నిమిషాల్లోనే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఆ నవ్వు మొహంతో రాజు యాదవ్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడో అనే ఆసక్తి మొదలవుతుంది. అయితే ఆ ట్రాక్ అక్కడే ఆపేసి, లవ్ స్టోరీని మొదలెట్టారు. ఈ లవ్‌లో క్లారిటీ ఉండదు. హీరోయిన్ పాత్రని పూర్తిగా రివీల్ చేయకుండా ఆ పాత్రని ఓ ఫజిల్ గా వదిలేశాడు దర్శకుడు. స్వీటీ రాజుని ప్రేమిస్తుందా, లేదా? తనది స్నేహమా, జాలా, సానుభూతా? అనే విషయాల్ని ఎక్కడా రివీల్ చేయలేదు. రాజు ఫ్లాష్ బ్యాక్ తెలిశాక, తనతో స్నేహం చేయడం, రూ.50 వేల ఉంగరం గిఫ్ట్ గా ఇస్తే వెంటనే ముద్దు పెట్టేసి, తన రూమ్‌లోకి ఆహ్వానించడం ఇవన్నీ ఆ పాత్రపై అనుమానాల్ని కలిగిస్తుంటాయి. చివరికి ఆ పాత్రని కూడా అలానే ముగించారు.
‘వాస్తవ సంఘటనల ఆధారంగా’ అంటూ సినిమా ప్రారంభానికి ముందు, చివర్లో ప్రకటించారు. అయితే దాని బదులు ‘బేబీ సినిమా ఆధారంగా’ అంటే కరెక్ట్‌గా సరిపోయేది. ఈ కథలో కథానాయిక పాత్రకు బేబీలోని హీరోయిన్ పాత్రకూ పోలికలు ఉంటాయి. ఈ కథని ముగించిన విధానం కూడా ‘బేబీ’ని గుర్తుకు తెస్తుంది. అయితే ‘బేబీ’లో ఆటోవాల లవ్ స్టోరీలో నిజాయితీ ఉంటుంది. కథానాయిక పాత్రపై కాస్త సానుభూతి కలుగుతుంది. ఆ వయసులో, మెచ్యూరిటీ లేక తీసుకొన్న నిర్ణయంలా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఎలాంటి కన్ఫ్యూజన్లు ఏం ఉండవు. అలాంటి సానుభూతి కూడా కలగదు. లవ్ స్టోరీలోనూ ఫీల్ ఉండదు. ఎంతసేపూ రాజూ యాదవ్ ఫీల్ అవ్వడం, ఎమోషన్లో మునిగిపోవడం తప్ప – ప్రేక్షకుల్ని ఒక్క సన్నివేశం కూడా కదిలించలేకపోయింది. దానికి తోడు అనవసరమైన ల్యాగ్ ఒకటి. చివర్లో పది నిమిషాలు సాగదీశారు. చంద్రబోస్ పాట కోసం. అప్పటికే సినిమాపై ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు.
గెటప్ శ్రీను అనగానే కామెడీ గుర్తొస్తుంది. ఈ సినిమాలోని రాజు యాదవ్ పాత్రలో కామెడీ మిస్ అయ్యింది. తనకు విచిత్రమైన మేనరిజం అయితే ఇచ్చారు. అలా సినిమా మొత్తం నవ్వుతూనే నటించడం చాలా కష్టం. ఆ కష్టాన్ని గెటప్ శ్రీను ఈజీగానే పాస్ అయిపోయాడు. పాటల్లో డాన్సులు కూడా బాగానే చేశాడు. అయితే తనలోని నటుడ్ని పూర్తి స్థాయిలో వాడుకోదగిన పాత్ర అయితే కాదిది. కథానాయిక బొద్దుగా ఉంది. మోడ్రన్ డ్రస్సుల్లో కంటే, సంప్రదాయ దుస్తుల్లోనే బాగుంది. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్నా, డిజైన్ చేసిన విధానం ఇంకాస్త క్లారిటీగా ఉండాల్సింది. ఈ రెండు పాత్రలూ మినహాయిస్తే, చెప్పుకోదగిన పాత్రేదీ తెరపై కనిపించదు.
ఆడియోలో రెండు పాటలు ముందే హిట్టు. అది కాస్త కలిసొచ్చింది. చంద్రబోస్ రాసిన చివరి పాట అర్థవంతంగా ఉంది. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. సన్నివేశాల్లో బలం లేదు. ఎమోషన్ వర్కవుట్ కాలేదు. బేబీ సినిమా ఛాయలు పుష్కలంగా కనిపించే కథ ఇది. ‘బేబీ’ జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు కనుక… ఈ రెండు సినిమాల్నీ పోల్చి చూసుకోవడం సహజం. అలా పోల్చుకొంటే ‘రాజు యాదవ్’ తేలిపోతాడు.
తెలుగు360 రేటింగ్ 1.5/5
-అన్వర్