రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ టీడీపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సంఖ్యా బలం ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. ఒకటికి వైకాపాకి వస్తుంది. అయితే, మరో ముగ్గురో నలుగురో వైకాపా ఎమ్మెల్యేలు మద్దతు లభిస్తే ఆ మూడో సీటు కూడా దక్కించుకునే అవకాశం ఉందనే ప్రచారమూ టీడీపీలో జరుగుతోంది. ఈ నెల 23న ఏపీకి సంబంధించి రాజ్యసభ ఎన్నికలు ఉంటాయి. దీంతో ఎగువసభకు వెళ్లడం కోసం ఇప్పటికే కొంతమంది పార్టీ నేతలతోపాటు, పారిశ్రామికవేత్తలు కూడా టిక్కెట్ల రేసులోకి వచ్చేశారు. ఎవరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఇదే సమయంలో కుల సమీకరణలు కూడా తెరమీదికి వచ్చేశాయి..!
రాజ్యసభకు వెళ్లేందుకు అనూహ్యంగా ఆసక్తి చూపుతూ తెరమీదికి వచ్చారు రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. ఈ ప్రతిపాదనకు సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ మద్దతు ఇచ్చారనీ తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. రాజకీయంగానీ, పాలనాపరంగానీ ఏదైనా సమస్యతో సీఎం దగ్గరకి ఎవరు వచ్చినా, ‘ముందుగా యనమలను కలిశారా’ అని అడుగుతుంటారట! ఆయనకి టీడీపీలో అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి, ఆయన సేవలు రాష్ట్రానికి చాలా అవసరం అని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ యనమల కాకపోతే, ఆయనకి బదులుగా ఆ సీటును వెనకబడిన వర్గాల వారికి కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారనీ, అలా అయితే ఏపీ విమన్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా పి. అనురాధకు అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది.
ఎస్సీ కేటగిరీలో ఆశావహుల జాబితాలో చాలామంది పేర్లు తెరమీదికి వస్తున్నాయి. వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, ఎన్. సుబ్రహ్మణ్యం, పరస రత్నం.. ఎస్సీలకి అవకాశం ఇస్తే వీరంతా పోటీకి సిద్ధంగా ఉన్నారట! అయితే, వీలైతే ఈసారి మాదిగలకు అవకాశం ఇవ్వొచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నారనే ఊహగానం కూడా చక్కర్లు కొడుతోంది. ఎందుకుంటే, మాల కమ్యూనిటీ నుంచి నలుగురు ఎంపీలు ఇప్పటికే పార్టీ తరఫున ఎన్నికై లోక్ సభకు వెళ్లారు కాబట్టి. ఒకవేళ సీఎం ఆలోచన ఇదే అయితే… ప్రస్తుతం ఏపీ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ గా ఉన్న వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దక్కొచ్చని వినిపిస్తోంది. ఇక, తెలంగాణ నుంచి కూడా టీడీపీ తరఫున రాజ్యసభ టిక్కెట్ల కోసం చాలామంది పేర్లు తెరమీదికి వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారట. వరుణ్ మోటార్స్ కి చెందిన ప్రభు కిషోర్, రియలన్స్ గ్రూప్ నుంచి మాధవ్ లు రాజ్యసభ సీటు రేసులో ఉన్నారని ప్రకటించుకున్నారు. ఇక, టీ టీడీపీకి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ వీరితోపాటు కంభంపాటి రామ్మోహన రావు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నట్టు వినిపిస్తోంది.
సో.. ఇదీ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే, ఆశావహుల ప్రయత్నాలు ఎలా ఉన్నా… అంతిమంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. అయితే, చివరి నిమిషంలో మాత్రమే అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేయడం చంద్రబాబుకి అలవాటు. ఈ ఆశావహులంతా అంత వరకూ వేచి చూడాల్సిందే.