రాజ్యసభ చర్చలో ప్రత్కేక హౌదాపై అదనంగా వొరిగేది వుండదని నిన్న నేను 360లో రాశాను. ఈ రోజు చర్చ పరిస్థితి అంతకన్నా దారుణంగానే వుంది. నిజానికి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే సాక్షాత్తూ ప్రధాని మోదీనే ప్రకటన చేసి వుండేవారు. లేదా చేస్తారని చెప్పేవారు. సో.. ఏదో వాగాడండరమే వుంటుంది గనక వెంకయ్య నాయుడిని మొదటి రోజు చివర మాట్టాడించారు. దానికి ముందు మాట్లాడిన వారు సూటిగానే మోడీ ప్రభుత్వ వైఖరిని తూర్పార బట్టారు. వారిలో టిడిపి సభ్యుడు సిఎంరమేష్ అయితే మేము మీకు భయపడుతున్నామని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేయడం గమనించదగ్గది. అంటే రేపు ఏది ఎటు పోయినా తెలుగుదేశం కేంద్రం వైఖరిని బలపర్చలేదని చెప్పడదలచారన్నమాట.మరోవైపున తమకు నమ్మకం వుందని కూడా ప్రకటించడం విశేషం. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మొదటిసారి మాట్లాడినా ఫర్వాలేదనిపించారు. మొదట జగన్ భక్తిని చాటుకున్నా రాజ్యాంగ కోణాలు కూడా కొన్ని లేవనెత్తారు.అభ్యంతరాలు వస్తున్నా చంద్రబాబు నాయుడు ధోరణిని కూడా ప్రస్తావించారు. సీతారాం ఏచూరి మూడోసారి ఈ సమస్యపై స్పష్టంగా మాట్లాడుతూ ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలని హడావుడి విభజన వల్ల ఇలాటి ఫలితాలుంటాయని నాడే హెచ్చరించామని గుర్తు చేశారు. దీనికి గాను ఆయనపై టిఆర్ఎస్ ఎంపి కేశవరావు వ్యాఖ్యలు చేసి రాజకీయ వ్యతిరేకత తీర్చుకున్నారు. అయితే ఆయన కూడా ఎపికి హౌదా ఇవ్వాలంటూనే తమ రాష్ట్రానికి రావలసినవి కూడా చూడాలని కోరడంలో తప్పేమీ లేదు. ఈ చర్చకు తానే కారణమంటూ కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లును వెనక్కు తీసుకుంటాననే కథనాలు తోసిపుచ్చారు. అసలు మీకా అవకాశమే లేదని వైస్ చైర్మన్ కురియన్స్పష్టంగా చెప్పారు. సభలో పెట్టాక రాజ్యాంగం ప్రకారం సభే దాని సంగతి చూస్తుందని గెలుపు ఓటములు చెప్పలేనని స్పష్టం చేశారు.మొత్తంపైన కెవిపి బిల్లు ఆగష్టు 9న వస్తుందని ప్రకటించారు. టిఎంసి సభ్యుడు మాత్రం వ్యతిరేకించగా సమాజ్వాదిపార్టీ కూడా బలపర్చింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు వ్యక్తిగతంగా తన పాత్రనూ తమ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా సమర్థించుకుంటూనే పెద్దరికం ప్రదర్శించారు. ఇతరులపై సహజశైలిలో వ్యంగ్యం ప్రయోగించి విమర్శలు కూడా తెచ్చుకున్నారు. ఏమైనా చివరకు హౌదా విషయంలో మాత్రం శూన్యహస్తమే చూపించారు. ఈ క్రమంలో రేపు అధికారికంగా సమాధానం ఇచ్చే అరుణ్జైట్టీ ఏమంటారనేది వెంకయ్య మాటలతోనే వెల్లడైపోయింది. రేపటి తతంగం లాంఛనమే ఇక.