వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిత్వానికి ఇప్పుడు ఓ పరీక్షను ఎదుర్కొంటున్నారు. అదే.. రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రముఖుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం. తాను జగన్మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యత్వం గురించి అడిగిన మాట వాస్తవమేనని.. బయట వారికి పదవులు ఇచ్చే సంప్రదాయం తమ వద్ద లేదని.. జగన్ చెప్పారని.. అయితే.. మూడు రోజుల్లో నిర్ణయం చెబుతానన్నారని.. పరిమళ్ నత్వానీ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో… జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పుడు.. రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.
అంబానీల ఎదుట జగన్ వొంగిపోతారా..? నిటారుగా నిలబడతారా..?
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు.. ఎవరెస్ట్ రేంజ్లో ప్రచారం చేస్తూంటాయి. ఆయన ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రజలకు మాత్రమే.. జవాబుదారీ అని.. ఇంక ఏ విషయాలను లెక్క చేయరని అంటూ ఉంటారు. గతంలో చాలా సందర్భాల్లో.. ఇలాంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. నిఖార్సైన వ్యక్తిత్వ పరీక్ష మాత్రం ఇప్పుడే ఎదురయింది. ముఖేష్ అంబానీ నేరుగా ఇంటికి వచ్చి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ అడిగినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. నిర్మోహమాటంగా నో చెప్పి ఉంటే.. అసలు చర్చే ఉండేది కాదు. జగన్ వ్యక్తిత్వం నిటారుగా నిలబడి ఉండేది. కానీ ఆలోచించుకోవడానికి మూడు రోజుల సమయం కావాలనడంతోనే కాస్త వంగిపోయినట్లయింది. ఇప్పుడు.. తీసుకోబోయే నిర్ణయంతోనే.. ఆయన వ్యక్తిత్వం పూర్తిగా వంగిపోతుందా.. లేక.. నిటారుగా నిలబడే ప్రయత్నం చేస్తారా అన్నది తేలుతుంది.
నత్వానీకి సీటు ఇస్తే సొంత ప్రయోజనాల కోసమే..! ఏపీకి పైసా లాభం ఉండదు.!
పరిమళ్ నత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించుకుంటే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అవన్నీ.. ఆయన వ్యక్తిత్వాన్ని అనుమానించేవే. ఎందుకంటే… పరిమళ్ నత్వానీ అనే వ్యక్తికి.. ఆంధ్రప్రదేశ్‌లో కనీస అనుబంధం లేదు. ఆయనకు రాజ్యసభ ఇస్తే.. ఆయన ఏపీ కోసం.. ఒక్క క్షణం కూడా వెచ్చించరు. ఆయన తమ వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ కోసమే.. పూర్తి సమయం వెచ్చిస్తారు. రాజ్యసభ సభ్యుడిగా వచ్చే అధికారాలు దాని కోసమే వినియోగిస్తారు. ఏపీ కోసం గళమెత్తలేదని..తర్వాత సన్నాయి నొక్కులు నొక్కినా ప్రయోజనం ఉండదు. ఇది ప్రజాప్రయోజన కోణం.. ఇక రాజకీయ పరంగా చూసినా.. పరిమళ్ నత్వానీ.. జగన్‌కు ఏ మాత్రం సన్నిహితుడు కాదు. పైగా.. తన తండ్రినే చంపించారని.. తాను గట్టి ఆరోపించిన వ్యాపార సామ్రాజ్యాధినేతకు అనుంగు అనుచరుడు. ఆ సామ్రాజ్యంలో.. ముఖ్యంగా ఏ గ్యాస్ కోసమైతే.. తన తండ్రిని చంపించారని ఆరోపించారో..ఆ గ్యాస్ వ్యవహారాలు మొత్తం చూసే.. వ్యక్తి పరిమళ్ నత్వానీ. మన గ్యాస్ మనకే లాంటి నినాదాలిచ్చిన జగన్.. ఇప్పుడు అలాంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే.. తేడా అని జనం అనుకోకుండా ఉండలేరు.
నత్వానీని రాజ్యసభకు పంపితే.. కేసుల మాఫీ కోసమేనని జనం నమ్మే చాన్స్..!
ఒక వేళ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇస్తే.. ఆ ఇవ్వడంపైనే పెద్ద చర్చ జరుగుతుంది. అదే సమయంలో.. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేదానిపైనా… రచ్చబండల దగ్గర్నుంచి టీవీ స్టూడియోల వరకూ డిబేట్ల మీద డిబేట్లు జరుగుతాయి. ఇందులో.. అందరూ పట్టుకునే సెంటర్ పాయింట్.. కేసులు. కేసుల కోసం.. బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం రాజీపడి.. బీజేపీ చెప్పిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు జగన్ ఇచ్చారని.. అందరూ ఓ కంక్లూజన్‌కు వచ్చేస్తారు. అబద్దమో నిజమో.. కాస్త సావధానంగా ఆలోచిస్తే.. ఇంతకు మించిన వేరే కారణం సామాన్యులకు కూడా కనిపించదు. ఇలాంటి అభిప్రాయం ప్రజలకు వస్తే.. జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం.. దేనికైనా దిగజారిపోతారన్న అభిప్రాయం బలపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను మరింత బలహీనపరుస్తుంది.
పార్టీనే నమ్ముకున్న వారికి ఏం చెబుతారు..?
ఇక సొంత పార్టీలోనూ అశావహులు చాలా మంది ఉన్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయంతో వీరి సంఖ్య పెరిగింది. అంతే కాదు.. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యేలతో.. వ్యాపారస్తులను.. అదీ కూడా ఇతర రాష్ట్రాల వారిని రాజ్యసభకు పంపడం.. వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యే అవకాశం ఉంది. ఎలా చూసినా.. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వబోమని… జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పేస్తేనే.. రాజకీయంగా కాస్త గౌరవం ఉంటుంది.. అలా కాదు.. అని నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపితే.. వ్యక్తిత్వ పరీక్షలో విఫలమైనట్లే భావించాల్సి ఉంటుంది.