నిర్భయ కేసులో బాల నిందితుడి విడుదలను వ్యతిరేకిస్తూ డిల్లీ ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేయడంతో నేడు రాజ్యసభలో నిర్భయ చట్టంపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు అంగీకరించాయి. హత్యలు మానభంగాలకు పాల్పడే 16-18సం.ల వయసు గల బాలనేరస్తులకు కూడా ఇకపై పెద్దవారితో సమానంగా శిక్షలు అమలు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్భయ చట్టంలో సవరణలు చేసింది. దానిని ఇదివరకే లోక్ సభ ఆమోదించింది. కానీ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకొనేందుకు మోడీ ప్రభుత్వానికి తగినంత బలం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఏదో ఒక కారణంతో సభను స్తంభింపజేస్తుండటంతో సవరించబడిన ఆ నిర్భయ బిల్లు ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. ఇవ్వాళ్ళ రాజ్యసభలో దానిపై చర్చకు అన్ని పార్టీలు అంగీకరించినందున ఆ బిల్లు ఆమోదానికి నోచుకొనే అవకాశం కనబడుతోంది. కానీ బాలనేరస్తులకు మరణశిక్ష వంటి కటినమయిన శిక్షలు అమలుచేయకుండా చట్టంలో మార్పులు చేయమని ప్రతిపక్షాలు కోరవచ్చును. ఇటువంటి నేరస్తులను కటినంగా శిక్షించేందుకు వీలుగా చేసిన నిర్భయ చట్ట సవరణలను ఇవ్వాళ్ళే రాజ్యసభ ఆమోదించాలని నిర్భయ (జ్యోతీ సింగ్) తల్లి ఆశాదేవి కోరుతున్నారు.