ప్రత్యేక హోదా హామీని విభజన చట్టంలో చేర్చడానికి వీలుగా చట్ట సవరణ చేసేందుకు కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రేపు ఓటింగ్ జరుగవలసి ఉంది. కానీ పార్లమెంటు రెండు రోజుల ముందే వాయిదాపడే అవకాశం ఉండటంతో దానిపై వచ్చే వర్షాకాల సమావేశాలలో ఓటింగ్ కి చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కెవిపికి తెలిపినట్లు సమాచారం. ఇప్పుడు రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి బలం లేనప్పటికీ వచ్చే సమావేశాల నాటికి బలం పెరిగే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ఈ సమావేశాలలో ఆ బిల్లుపై ఓటింగ్ జరగకుండా మోడీ ప్రభుత్వం తప్పించుకొందని, బిల్లు నెగ్గినా ఓడినా ప్రత్యేక హోదా సాధించేవరకు దాని కోసం తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని కెవిపి రామచంద్ర రావు. ఆనాడు మా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రవిభజన చేసిందని ప్రజలు భావిస్తున్న సంగతి మాకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మేము చేస్తున్న ఈ పోరాటం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప దాని నుంచి మేము ఎటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించడం లేదని కెవిపి చెప్పారు. మా శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు అనే డైలాగ్ చాలా పాతదయిపోయింది కనుక అది చెప్పను కానీ మా పార్టీకి శక్తిమేర దాని కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని జైరాం రమేష్, కెవిపి, రఘువీరా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చకుండా ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని మోసం చేస్తోందని ఆరోపిస్తున్న జైరాం రమేష్, విభజన సమయంలో దానిని చట్టంలో చేర్చమని పురందేశ్వరి తదితర రాష్ట్ర నేతలు కోరినప్పుడు అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఆ విషయం కెవిపి కూడా తెలుసని పురందేశ్వరి కొన్ని నెలల క్రితం మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు ఏవిధంగా సాధ్యం అవుతుంది? అప్పుడు తమ చేతిలో ఉన్న పనిని చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ బిల్లు పెట్టి హడావుడి చేస్తూ, మోడీ ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం చూస్తుంటే వారు కూడా ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలను త్రిప్పి కొట్టడానికి నేడో రేపో పురందేశ్వరి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆనాడు ప్రత్యేక హోదా గురించి జైరాం రమేష్ చెప్పిన మాటల గురించి ప్రజలకు వివరిస్తారేమో?