వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్న రైతులు… అమరావతి రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ విజయవాడ వచ్చిన సందర్భంగా… అమరావతి రైతులకు ఈ మేరకు హామీ ఇచ్చారు. కేంద్రాన్ని కదిలించే రీతిలో పోరాటం చేద్దామని.. అమరావతి రైతులకు టికాయత్ భరోసా ఇచ్చారు. త్వరలోనే… ఢిల్లీ నుంచి రైతు ఉద్యమ ప్రతినిధి బృందంతో సహా అమరావతి గ్రామాలకు వెళ్లి మద్దతు ప్రకటిస్తామని టికాయత్ ప్రకటించారు. ఢిల్లీ రైతుల ఉద్యమానికి అమరావతి రైతులు గతంలో మద్దతు పలికారు. అమరావతి నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి .. వారికి మద్దతు ప్రకటించి వచ్చారు. దాన్ని టికాయత్ గుర్తుంచుకున్నారు. తమ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టికాయత్ చేస్తున్న ఉద్యమం… సుదీర్ఘంగా సాగుతోంది. ఢిల్లీ శివార్లలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. ప్రాణాలైనా అక్కడే విడుస్తాం.. కానీ వ్యవసాయ చట్టాలు రద్దు కాకుండా వెనక్కి పోబోమని చెబుతున్నారు. వారిని బుజ్జగించడానికి కేంద్రం నానా తంటాలు పడుతోంది. ప్రస్తుతానికి ఉద్యమాన్ని రైతులు కొనసాగిస్తున్నారు. చర్చల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడం లేదు. టికాయత్ నేతృత్వంలో సాగుతున్న ఉద్యమం .. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలపై పోరాడాలనుకుంటున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఆయనను తమ తమ ఉద్యమాలకు మద్దతు ప్రకటించమని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి టికాయత్ మద్దతు ప్రకటించారు. అమరావతి రైతులకూ మద్దతు తెలిపారు. త్వరలోనే టికాయత్ మార్క్.. ఉద్యమాలకు అమరావతి రైతులు అంకురార్పణ చేసే అవకాశం కనిపిస్తోంది. రైతు ఉద్యమ నేతలు అమరావతి గ్రామాలకు వచ్చినప్పటి నుంచి అమరావతి ఉద్యమం మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.