ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. వేధింపులు.. దాడుల నిరోధానికి దశ యాప్ తీసుకు వచ్చిన ప్రభుత్వం.. వాటి ద్వారా పలువురికి సేవలు అందించింది. మీట నొక్కితే.. పోలీసులు ఎక్కడ అమ్మాయి ఆపదలో ఉందో గుర్తించి అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు… కొత్తగా అభయం అనే మరో యాప్ను విడుదల చేశారు. ఆటోలు, ట్యాక్సీలలో ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం అభయం యాప్ను రూపొందించారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని.. ఆటోలో ప్రయాణించేటప్పుడు.. ఏదైనా సాయం అవసరం అయితే.. సులువుగా పోలీసుల్ని సంప్రదించవచ్చు.
అభయం యాప్ పని చేయాలంటే.. ఆటోలోనూ ట్రాకింగ్ పరికరాలు ఉండాలి. ప్రభుత్వమే వాటిని ఏర్పాటు చేస్తోంది. మొదటగా విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేశరు. ఈ యాప్ పనితీరును పరిశీలిస్తున్నారు. మరో ఏడాదిలో విజయవాడ, తిరుపతిలో లక్ష వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటో, టాక్సీ ఎక్కిన వెంటనే ప్రయాణికురాలు స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వెంటనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఏదైనా ఆపద సమయంలో వారివద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే రెడ్ బటన్ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు.
మహిళల భద్రతలో రాజీపడకూడదని.. ఎంత ఖర్చయినా సరే.. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే దిశ యాప్ ద్వారా బటన్ నొక్కిన 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధానం తీసుకు వచ్చారు. దిశ యాప్ను పోలీసు శాఖ నిర్వహిస్తుండగా అభయం యాప్ రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. మహిళల భద్రత విషయంలో ఏపీ సర్కార్ ప్రయత్నాలు.. యాప్లు మహిళలకు రక్షణ కవచంగా మారుతున్నాయి.