రేపు (శుక్రవారం) రెండు సినిమాలు రాబోతున్నాయి. రాక్షసుడు, గుణ 369 విడుదల కాబోతున్నాయి. రెండింటిపైనా అన్నో ఇన్నో అంచనాలున్నాయి. పబ్లిసిటీ పరంగానూ రెండు సినిమాలూ బాగానే పోటీ పడుతున్నాయి. అయితే.. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీ, ఇటు కార్తికేయకూ ఈ సినిమా ఫలితాలు చాలా కీలకం. ఓ రకంగా… వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించేవి ఈ చిత్రాలే.
అల్లుడు శ్రీనుతో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ. తొలి సినిమాకే దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెట్టారు. వినాయక్ దర్మకుడు కావడం, ఫైట్లు, పాటలూ అంటూ కమర్షియల్ అంశాలు జోడించడం, సమంత లాంటి గ్లామర్ క్వీన్ కథానాయికగా దొరకడంతో ఆ సినిమా పాసైపోయింది. అయితే ఆ తరవాతే… బెల్లంకొండకు సరైన విజయం దక్కలేదు. సాక్షం, సీత, స్పీడున్నోడు, కవచం… ఇలా అన్నీ ఫ్లాపులే. జయ జానకీ నాయక మాత్రం యావరేజ్ గా నిలబడగలిగింది. ఇప్పుడు ఈ సినిమాతో అటో ఇటో తేలిపోతుంది.
కథానాయకుడిగా టాలెంట్ ఉన్నా, సరైన కథల్ని ఎంచుకోకపోవడమే పెద్ద లోటు.. అని తన పరాజయాలు నిరూపించాయి. తాను కూడా కథల విషయంలో తప్పు చేశాననే అంటున్నాడు. కానీ రాక్షసన్ ఫ్లాప్ అయితే ఈ మాట కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ తమిళంలో పెద్ద హిట్టు. అలాంటి కథని రీమేక్ చేసి, కథలో లోపం అని చెప్పడానికి వీల్లేదు. రాక్షసుడు అటూ ఇటూ అయితే.. ఎలాంటి కథల్ని ఎంచుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది. నిర్మాతలూ పెట్టుబడి పెట్టడానికి భయపడతారు. ఈ గండం గట్టక్కాలంటే… తప్పకుండా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే.
మరో వైపు కార్తికేయది కూడా ఇదే పరిస్థితి. ఆర్.ఎక్స్ 100 తో అనూహ్యంగా విజయం సాధించి, టాలీవుడ్ ని ఆకర్షించాడు. ఈ సినిమా తరవాత ఏకంగా పదిమంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చేశారు. అయితే రెండో సినిమా హిప్పీ దారుణంగా బోల్తా పడింది. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి, ఇచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. కానీ.. సినిమా ఫ్లాప్ అయ్యేసరికి.. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దాంతో కార్తికేయ వాస్తవంలోకి రావాల్సివచ్చింది. గుణ 369 పై తను చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపై చాలా నమ్మకంగానూ ఉన్నాడు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ మెటీరియలైజ్ అవ్వాలంటే గుణ… హిట్ అవ్వాల్సిందే. లేదంటే.. తను వన్ సినిమా వండర్ గా మిగిలిపోయే ప్రమాదం వుంది. తొలి విజయం గాలివాటం గా మిగిలిపోతుంది కూడా. అందుకే… గుణ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు.
ఎవరెంత కష్టపడినా, ఎవరి నమ్మకాలు ఎలా వున్నా, సినిమా తీర్పు ఎప్పుడూ ప్రేక్షకులదే. మరి వారి మనసుల్ని గెలుచుకునే సత్తా ఈ రెండింటిలో దేనికి వుందో…. ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.