“చర్చలు జరుగుతున్నాయి. ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర కోసం నన్ను సంప్రతించిన మాట నిజమే. అయితే… నేనింకా కథ వినలేదు” – ఇదీ రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పిన మాట!
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా… ఆయన తనయుడు బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీదేవి పాత్రలో రకుల్ నటించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే… సినిమాకు ఇంకా సంతకం చేయలేదని ఆమె తెలిపారు. “ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేదు. షూటింగులతో బిజీ బిజీ. అవి పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాక కథ వింటా. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆమె అంటే ఎంతో గౌరవం. ‘యన్.టి.ఆర్’లో శ్రీదేవి పాత్ర పోషించడం నాకు పెద్ద సవాలే. ఆవిడ పాత్రకు నేను న్యాయం చేయగలనని నాపై నమ్మకంతో నన్ను సంప్రతించడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాకు సంతకం చేశాక… అధికారికంగా ప్రకటిస్తా” అని రకుల్ పేర్కొన్నారు. సినిమాకు సంతకం చేయలేదు గానీ… శ్రీదేవిగా రకుల్ నటించడం ఖరారు అయినట్టే అని ఆమె మాటల్లో అర్థమవుతుంది. శ్రీదేవి పాత్ర పోషించడానికి ఆమె ఎంతో ఆసక్తి చూపిస్తోంది. “ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు కొత్త రకుల్‌ని చూడొచ్చు” అని వ్యాఖ్యానించారంటే… రకుల్ ఎంత సుముఖంగా వున్నారో అర్థం చేసుకోవచ్చు.