యంగ్ హీరోయిన్ల బ్యాచ్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌దే అగ్రస్థానం. తన కాల్షీట్లు ఇప్పుడు హాట్ కేకులు. గ్లామర్, నటన మాట అటుంచితే… తన ప్రొఫెషనాలిటీకి ఎవరైనా సరే ముగ్థులైపోవాల్సిందే. ఓ సినిమా ఒప్పుకొందంటే.. అది పూర్తయి, బయటకు వచ్చేంత వరకూ తన 100 % ఎఫెక్ట్నీ ఆ సినిమాపై పెట్టేస్తుంది రకుల్. గతేడాది మూడు హిట్లతో అలరించిన రకుల్ ఈ యేడాది.. ‘విన్నర్’తో బోణీ కొట్టబోతోంది. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రకుల్‌తో జరిపిన చిట్ చాట్ ఇది.
2016లో మూడు హిట్స్ కొట్టారు. ఈసారీ అదే జోరు కొనసాగిస్తారా?
2016 మ్యాజిక్ ఈ యేడాదీ రిపీట్ అయితే బాగుంటుంది అనుకొంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. హిట్లు కొడుతుంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. కానీ నేను మాత్రం హిట్లూ, ఫ్లాపుల కోసం పనిచేయను. వర్క్ చేయడం అంటే ఇష్టం. అందులోనే ఆనందం ఉంది.
స్టార్ హీరోయిన్ అనే మాట.. ఎంత వరకూ కిక్ ఇస్తుంది?
నేనైతే ఇప్పటి వరకూ దాన్ని తలకెక్కించుకోలేదు. స్టార్, ఇమేజ్, సెలబ్రెటీ అనే మాటలు వినడానికి, చెప్పుకోవడానికీ బాగుంటాయి. కానీ… వాటితో పెట్టుకొంటే తలనొప్పే. అందుకే వాటిని నేనంత ప్రాధాన్యం ఇవ్వను.
అటు పెద్ద హీరోలతో నటిస్తుంటారు.. ఇటు కొత్త కుర్రాళ్ల సినిమాలూ ఒప్పుకొంటారు. హీరోల విషయంలో మీకంటూ ఓ రూల్ లేదా?
మంచి కథలు, మంచి పాత్రలు దక్కడం వైపే నా దృష్టి. ఇక్కడ ఒకరు చిన్నా కాదు, ఇంకొకరు పెద్దా కాదు. అందరి ఫేటూ ఓ సినిమాతో మారిపోతుంటుంది. హాలీవుడ్లో ఎంజిలీనా జోలీని చూడండి. తను గొప్ప స్టార్. చాలామంది స్టార్లతో కలసి నటించింది, కొత్తవాళ్లతోనూ చేసింది. మనమెందుకు గిరి గీసుకొని ఉండాలి?
బన్నీతో సరైనోడు, చరణ్‌తో ధృవ.. ఇప్పుడు సాయిధరమ్ తో విన్నర్.. వరుసగా మెగా హీరోలతో చేస్తున్నారు.. ఎలా ఉంది వాళ్లతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్…?
చాలా బాగుంది. ముగ్గురూ కూల్ అండ్ కామ్. అందరితో పోలిస్తే సాయి ధరమ్ తోనే నాకు చనువు ఎక్కువ. ఎందుకంటే సాయి నాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచే పరిచయం. ఇద్దరూ కలసి సినిమాలు చేయకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుకొంటూ ఉండేవాళ్లం. అందుకే.. సెట్లో తాను ఓ కో ఆర్టిస్ట్‌లా ఎప్పుడూ కనిపించలేదు. ఇద్దరం ఫ్రెండ్స్‌లా పనిచేసుకొంటూ వెళ్లిపోయాం.
మిమ్మల్ని మెగా హీరోయిన్ అని పిలిస్తే…?
ఆనందమే. అయితే ఒకటి మాత్రం నిజం. నేను ఏ సినిమాకి ఆ సినిమానే విడి విడిగా చూస్తుంటా. మెగా హీరోతో పనిచేస్తున్నానా? నేను మెగా హీరోనా అనేది పట్టించుకోను. హీరో ఎవరైనా వాళ్లతో ఒకేలా రిలేషన్ కొనసాగిస్తా.
ఇంతకీ విన్నర్లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇందులో నా పేరు సితార. ఓ అథ్లెట్‌ని. ఎప్పుడూ కెరీర్ గురించి తప్ప.. మరే విషయం ఆలోచించను. తనకు ప్రేమన్నా సరైన అభిప్రాయం లేదు. నా వెనుక హీరో ప్రేమ ప్రేమా అంటూ తిరుగుతుంటాడు. తనకో లక్ష్యం ఎలా ఏర్పడింది? ఎలా విన్నర్‌గా నిలబడ్డాడు? అనేది ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా గురించి తేజూ హార్స్ రైడింగ్ నేర్చుకొన్నాడు. వాటికి సంబంధించిన సన్నివేశాల్ని టర్కీలో తెరకెక్కించారు. స్ర్కీన్‌పై ఆ సీన్లన్నీ బాగా వచ్చాయి. కమర్షియల్ వాల్యూస్ ఉన్నా, ఎమోషన్ని ఎక్కడా మిస్ చేయలేదు. అందరికీ కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
అథ్లెట్ పాత్ర కదా? అందుకోసం ఎలాంటి తర్పీదు తీసుకొన్నారు?
పెద్దగా నేను చేసిందేం లేదు. ఎందుకంటే ఓ అథ్లెట్‌కి ఉండాల్సిన ఫిట్ నెస్ నాకూ ఉంటుంది. కాబట్టి.. పెద్దగా కష్టపడలేదు. అయితే రన్నింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఆ రోజుంతా నేను నీళ్లు తాగేదాన్ని కాదు. ఉదయం సెట్‌కి వస్తే పేకప్ చెప్పేసేంత వరకూ.. కేవలం పుచ్చకాయ ముక్కలు, కీర తీసుకొనేదాన్నంతే.
మేరీ కోమ్లాంటి కథలొస్తే చేయడానికి రెడీయేనా?
ఓ… తప్పకుండా. అయితే.. సినిమా అంతా నా భుజాన వేసుకొని నడిపించేంత స్టామినా నాకు ఉందా, లేదా? అనేది ఆలోచించుకోవాలి. నేనేం నయనతారలా గొప్ప స్టార్‌ని కాదు కదా? తన సినిమా అంటే టికెట్లు తెగుతాయి. కాబట్టి నిర్మాతలు ధైర్యం చేస్తారు. నేను ఆ తరహా పాత్రలు చేయడానికి ఇంకా టైమ్ ఉంది.
కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చే చేజారిపోయాయి. అలాంటప్పుడు ఏం అనిపిస్తుంది?
నిజంగానే బాధ ఉంటుంది. కానీ అది ఒక రోజే. తరవాత అంతా మామూలే. అయితే లక్కీ ఏంటంటే.. నా దగ్గరకు వచ్చి మిస్ అయిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. ఆ రకంగా నేను అదృష్టవంతురాలినే.
మహేష్ బాబు – మురుగదాస్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
అదో ఇంటిలిజెంట్ థ్రిల్లర్. కథానాయకుడి పాత్రే కాదు, ప్రతీ పాత్రా బాగుంటుంది. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు మురుగదాస్. ఈ సినిమాలో నా లుక్ వేరేలా ఉంటుంది.
మహేష్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?
మహేష్ ఓ సూపర్ స్టార్. ఆ స్థాయి ఆయనకు ఊరకే రాలేదు. ఆ సంగతి ఈ సినిమా సెట్లో నాకు అర్థమైంది. పంక్చువాలిటీ విషయంలో మహేష్ తరవాతే ఎవరైనా. ఇంకా బాగా చేయాలి.. అనే తపన ఆయనలో కనిపించింది.