తమిళంలో మూడు నాలుగు విజయాలతో నిలదొక్కుకున్న ప్రతి హీరో తెలుగులో తనకంటూ మంచి మార్కెట్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. డ్యాన్సర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా, యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారిన శివ కార్తికేయన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. తమిళనాట శివకు మంచి ఫాలోయింగ్ వుంది. ఇప్పుడు తెలుగుపై కన్నేశాడు. ‘రెమో’తో మన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో, తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాలకు మంచి క్రేజ్, మార్కెట్ రావాలంటే ముందుకు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన స్టార్ హీరోయిన్ను సినిమాలోకి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ ప్లాన్‌లో భాగంగా ఫస్ట్ సమంతను, నెక్స్ట్ రకుల్‌ను హీరోయిన్లుగా తీసుకున్నాడు.
ప్రజెంట్ సెట్స్ మీదున్న శివ కార్తికేయన్ ‘సీమ రాజా’లో సమంత నటిస్తుంది. తెలుగులో ఆమెకున్న మార్కెట్ దృష్ట్యా ఎవరో ఒకరు రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తారు. లేదంటే ‘రెమో’కి చేసినట్టు ఏ దిల్ రాజు చేతిలోనో సినిమా విడుదల బాధ్యత పెట్టి హీరోని ప్రేక్షకుల మీదకు రుద్దేయడమే. ‘రెమో’ విడుదల సమయంలో ఏ పత్రిక చూసినా, టీవీ చూసినా శివ కార్తికేయన్ కనిపించాడు. అంతలా చెన్నై నుంచి యాడ్స్ ఇచ్చి అతణ్ణి ప్రమోట్ చేశారు. సమంతతో చేస్తున్న ‘సీమ రాజా’ పూర్తయిన తర్వాత రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకి సంతకం చేశాడు. అందులో కథానాయికగా రకుల్‌ని తీసుకోవాలానుకుంటున్నాడు. ఆల్రెడీ రకుల్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధమని చెప్పారట. చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని రకుల్ ఈ అవకాశాన్ని వదులుకునే ఆలోచనలో లేదు.