టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్‌ను అధికారులు విచారించలేదు. అసలు ఆమె పేరు కూడా ప్రచారంలోకి రాలేదు. కానీ కెల్విన్ అనే వ్యక్తి.. ఎఫ్ క్లబ్ అనే పబ్‌ల డ్రగ్స్ వ్యవహారాలను ఆరా తీసినప్పుడు రకుల్ పేరు కూడా ఈడీకి ప్రముఖంగా కనిపించింది. అయితే అప్పట్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు ఆమెను పక్కన పెట్టారు.. ఆమెను కనీసం విచారణకు కూడా ఎందుకు పిలిపించలేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది.
రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారంపై గతంలో ముంబై పోలీసులు విచారణ జరిపారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసుల్లో బయటకు వచ్చిన పేర్లు.. విచారణలో రకుల్ పేరు ఉంది. ఆమెను కూడా ప్రశ్నించారు. అయితే ఆమె తన గురించి మీడియాలో రాకుండా చేయడానికి కోర్టుల్ని కూడా ఆశ్రయించారు. అసలేం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈడీ కేసులోనూ ఆమెను విచారణకు పిలిచారు. తను బిజీ అని రాలేనని ఈడీకి మొదట లేఖ రాశారు .. అయితే రావాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఆమె హాజరయ్యారు. ఎఫ్ క్లబ్, కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు కూపీ లాగారు.
ఎఫ్‌క్లబ్‌లో జరిగిన ఓ పార్టీ వ్యవహారం చుట్టూనే మొత్తం కథ తిరుగుతోంది. ఆ పార్టీలో ఉన్న ఇతర తారలను అప్పట్లో ఎక్సైజ్ అధికారులు పిలిపించి ప్రశ్నించారు..కానీ అదే పార్టీలో కీలకంగా ఉన్న రకుల్‌ను మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈడీ మాత్రం వదిలి పెట్టలేదు. ఇక్కడే కీలకమైన విషయాలేవో ఇంకా బయటకు రావాల్సి ఉందన్న అనుమానాలు బలపడటానికి అవకాశం ఏర్పడుతోంది.