కథానాయిక భావన కిడ్నాప్ వ్యవహారం… పుట్టించిన గుబులు అంతా ఇంతా కాదు. జరిగిన ఘటనకు యావత్ సినీలోకం తలదించుకొంటోంది. పరిశ్రమలో కథానాయికల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా తయారైంది. ఇలాంటి పరిస్థితి తమకు ఎదురైతే ఆ పరిస్థితేంటి?? అని కథానాయికలంతా భయపడిపోతున్నారు. రకుల్ ప్రీత్సింగ్కీ ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి తనదైన స్టైల్లో రియాక్షన్ ఇచ్చింది. ”నాకు గానీ అలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడికక్కడే వాళ్లని చంపేస్తా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టను” అని ఆవేశ పడిపోయింది. సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ”మదర్స్ డే, వుమెన్స్ డే.. ఇలాంటివన్నీ జరుపుకోవడం ఎందుకు?? మహిళలపై కనీస గౌరవం లేకపోతే ఇవన్నీ అవసరమా? అలాంటి వాటి కోసం మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ వ్యవహారం. ముందు మహిళల్ని మామూలు మనుషులుగా చూడడం మొదలెడదాం. ఆ తరవాత గౌరవిద్దాం” అంది రకుల్.
ఇది వరకు తనకీ ఇలాంటి పరిస్థితి ఎదురైందట. ఓ ఆకతాయి వద్దన్నా వినకుండా ఫొటోలు తీస్తుంటే, లైఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందట రకుల్. ”ఆరోజు నిజంగా నేను ఓ కుర్రాడ్ని కొట్టా. తానూ నన్ను కొట్టాడు. ఇలాంటివి జరిగినప్పుడే ఇంకాస్త స్ట్రాంగ్ అవుతామేమో.. భావన విషయంలో చాలా అన్యాయం జరిగింది. తనకు తగిన న్యాయం చేయాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి” అంటోంది రకుల్. ”షూటింగ్ కి వెళ్తున్నప్పుడు త్వరగా వచ్చేయ్.. కార్లో ఎక్కడికి వెళ్లకు. ఎవరినీ నమ్మకు అని అమ్మ చెబుతుండేది. కానీ నేను పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదు. ఇప్పుడు అమ్మ మాటలు గుర్తొస్తున్నాయి” అంటూ తన అనుభవాల్ని వివరించింది రకుల్.