రామ్ తదుపరి సినిమా లింగు స్వామితో ఖరారైంది. రేపు (గురువారం) ఓ అధికారిక ప్రకటన వస్తోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించాలన్నది ప్లాన్. ఈరకంగా,.. రామ్ తమిళంలోనూ డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. `ఇస్మార్ట్ శంకర్` తరవాత.. రామ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. `రెడ్` సినిమా అటూ ఇటూగా ఉన్నా – వసూళ్లు మాత్రం బాగా వచ్చాయి. దానికి కారణం `ఇస్మార్ట్ శంకర్` తో వచ్చిన హైపే. రామ్ దృష్టి ఇప్పుడు మాస్ సినిమాలపై పడింది.యాక్షన్ డ్రామాలను ఎంచుకుందామనుకుంటున్నాడు. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. అయితే టాలీవుడ్ లో స్టార్ దర్శకులంతా బిజీ. అందుకే తమిళ దర్శకుడ్ని నమ్ముకోవాల్సివచ్చింది.
లింగుస్వామి ఇప్పుడు ఫామ్ లో లేడు. ఈమధ్య తన ప్రాజెక్టులు కొన్ని ఆఖరి క్షణాల్లో చేజారిపోయాయి. తమిళంలో లింగుస్వామికి ఛాన్సులు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. దాంతో లింగు స్వామి తెలుగు హీరోలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో గోపీచంద్ కి ఓ కథ వినిపించాడు. కానీ గోపీచంద్ లింగు స్వామి కథని పక్కన పెట్టాడు. అంతెందుకు.. హవీష్ కి సైతం లింగు స్వామి ఓ కథ చెప్పాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అంతా ఓకే అనుకున్న తరుణంలో నిర్మాత చేతులెత్తేశాడు. ఇప్పుడు ఆ కథే.. రామ్ దగ్గరకు వచ్చింది. ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన కథని…. రామ్ ఎంచుకున్నాడిప్పుడు. ఎప్పటి నుంచో తమిళంలో ఓ సినిమా చేసి, అక్కడి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలన్నది రామ్ ఆలోచన. సరిగ్గా… అప్పుడే లింగు స్వామి తగిలాడు. తనకు సూటయ్యే యాక్షన్ కథ చెప్పడంతో రామ్ ఓకే అనేశాడు. లింగు స్వామి కి ఈమధ్య ఫ్లాపులున్న సంగతి కూడా రామ్ పట్టించుకోలేదు. మరి ఆ నమ్మకాన్ని లింగు స్వామి ఎంత వరకూ నిలబెట్టుకుంటాడో చూడాలి.