కొడుకునెప్పుడూ… తండ్రి తన భుజాలపై ఎత్తుకొని ప్రపంచాన్ని చూపిస్తాడు.
తనకంటే… ఎత్తునుంచి ఈ లోకాన్ని చూడాలని.. తనకంటే పైస్థాయికి ఎదగాలన్నది ఆ తండ్రి ఆశ. అయితే తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, తండ్రిని మించిన తనయులుగా రాణించేవాళ్లు చాలా తక్కువ. నాన్నో శిఖరం అయితే.. ఆ శిఖరంపై సింహాసనం వేసుకొని కూర్చున్న వాళ్లు ఇంకా.. ఇంకా.. అరుదు. సినిమాల్లోనే చూడండి.. ఓ సూపర్ స్టార్ ఇంటి నుంచి వచ్చి, అంతే స్టార్ డమ్ ని సంపాదించిన వాళ్లు దేశం మొత్తంమ్మీద ఎవ్వరూ కనిపించరు.. రామ్ చరణ్ తప్ప!
చిరంజీవి అంటే.. తెలుగు సినిమా, తెలుగు సినిమా అంటే చిరంజీవి అన్నట్టు మూడు దశాబ్దాల పాటు సాగింది. చిరు సంపాదించిన కీర్తి గురించి ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. అట్టడుగు స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన వైనం.. భవిష్యత్ తరాలకు ఆదర్శం. సినిమా వాళ్లకే కాదు.. ఏమైనా సాధించాలని ఆశ పడేవాళ్లకు.. చిరు జీవితం ఓ గీటురాయి. చిరు వారసుడిగా వచ్చి, నిలదొక్కుకోవడం, తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం.. మామూలు విషయం కాదు. చిరు సృష్టించిన చరిత్రని తిరగరాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ చరణ్ దాన్ని సాధించాడు.
చిరుత చూసినప్పుడు… `తను హీరో ఏంటి?` అనుకొన్న వాళ్లున్నారు. చిరు ఇంటి నుంచి వచ్చాడు కాబట్టి.. హీరో అయ్యాడు అని లైట్ తీసుకొన్నవాళ్లున్నారు. కానీ.. తొలి సినిమాతోనే తన డాన్స్, ఫైట్స్‌లో ఈజ్ చూపించి ఫ్యాన్స్ ని మెప్పించగలిగాడు చరణ్. కట్ చేస్తే.. మగధీరతో హోల్ సేల్ గా అందర్నీ తన వైపుకు తిప్పుకోగలిగాడు. రెండో సినిమాకే అల్ టైమ్ రికార్డుల్ని తన ఖాతాలో రాసుకోగలిగాడు. ఆ తరవాత.. హిట్టూ, ఫ్లాపులూ చరణ్ ప్రయాణంలో వస్తూ, పోతూ ఉన్నాయి. అయితే చరణ్‌లోని పూర్తి స్థాయి విజృంభణ చూసే అవకాశం రంగస్థలంతో దక్కింది. రంగస్థలం చరణ్‌కి ఓ గేమ్ ఛేంజర్ మూమెంట్. చరణ్‌లో నటుడ్ని, స్టార్నీ కలిపి వాడుకొన్న సినిమా అది. ఆ తరవాత నాన్ చిరు ఫ్యాన్స్ కూడా.. చరణ్ ని అభిమానించడం మొదలెట్టారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ది మరో చరిత్ర. ఈ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆస్కార్ వరకూ వెళ్లాడు. ఇవన్నీ చిరు.. ఓ తండ్రిగా గర్వించే అపురూపమైన క్షణాలు.
ఇండియన్ సినిమాలో స్టార్లకు, సూపర్ స్టార్లకూ కొదవలేదు. అయితే వాళ్ల వారసులెవరూ రాణించిన దాఖలాలు లేవు. చరణ్ మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. సాధించిన విజయాలు, సంపాదించిన స్థాయి మాత్రమే చరణ్‌ని ప్రత్యేకంగా నిలబెట్టలేదు. తన వినయం, పెద్దల పట్ల గౌరవం, ఎదిగి ఉండే తత్వం.. ఇవన్నీ చిరుని గుర్తు తెస్తాయి. చరణ్ వివాదాల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. టంగ్ స్లిప్ అయిన సందర్భం ఒక్కటీ కనిపించదు. `నేనే గొప్ప` అనే పొగరు.. తన మాటల్లో ఎప్పుడూ వినిపించదు. ఏం సాధించినా… ఎంత ఎదిగినా – ఇంకా తండ్రిచాటు బిడ్డగానే కనిపిస్తుంటాడు. ఇది వరకు చరణ్ కథలన్నీ చిరు విని, ఓకే చేసేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చిరు చేసే సినిమా కథలన్నీ చరణ్ వింటున్నాడు. నాన్నని తాను ఎలా చూడాలనుకొంటున్నాడో, అలాంటి సినిమాల్నే తండ్రి కోసం పట్టాలెక్కిస్తున్నాడు. నిర్మాతగా మారి… తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా`కు ఓ దృశ్యరూపం ఇచ్చాడు. ఇదంతా.. చరణ్ ఎదిగిన తీరుకి ప్రత్యక్ష నిదర్శనాలు.
ఇప్పుడు చరణ్ గ్లోబల్ స్టార్. ఆర్.ఆర్.ఆర్తో… తెచ్చుకొన్న క్రేజ్‌ని జాగ్రత్తగా కాపాడుకొంటూ ముందుకు సాగాల్సిన సమయం. దానికి తగిన ప్లానింగ్ చరణ్ దగ్గర ఉంది. ఇప్పుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదంతా చూసి.. చిరు ఓ తండ్రిగా పొంగిపోతుంటారు. అయితే ఇదంతా ఆరంభం మాత్రమే. చరణ్ ఎక్కాల్సిన మెట్లు, అధిరోహించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్.. గ్లోబల్ స్టార్! హ్యాపీ బర్త్ డే టూ యూ!