మెగా ఫ్యామిలీ నుంచి మరో చారిటబుల్ ట్రస్ట్ రాబోతోంది. ఆల్రెడీ ‘చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్’ ద్వారా మెగా ఫ్యామిలీ ఛారిటీ చేస్తోంది. ఇది కాకుండా మరో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు రామ్‌చరణ్ ప్రకటించారు. బ్రాండ్స్‌కి ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఆదాయంలో 15 నుంచి 20 శాతం ట్రస్ట్‌కి ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కొంత గ్యాప్ తరవాత బ్రాండ్ అంబాసిడర్‌గా డీల్ యాక్సెప్ట్ చేయడానికి కారణం అదేనని చెప్పుకొచ్చారు. హ్యాపీ మొబైల్స్ ప్రెస్మీట్లో ఈ విషయాన్ని రామ్‌చరణ్ వెల్లడించారు.
ఇంకా రామ్‌చరణ్ మాట్లాడుతూ “సినిమాల నుంచి వచ్చే ఆదాయంలో కొంత చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌కి ఇస్తున్నాం. సుమారు దశాబ్ద కాలంగా బయట వ్యక్తుల దగ్గర నుంచి నయా పైసా తీసుకోకుండా బ్లడ్ బ్యాంక్‌ని రన్ చేస్తున్నాం. అవసరం వున్నవారికి కంటి ఆపరేషన్లు చేయించడం, రక్తదానాలు చేయడం చేస్తున్నాం. ఈ సేవను మరింత కొనసాగించాలని ఒక ఛారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ ఫౌండేషన్ పనులు మొదలయ్యాయి. త్వరలో ఫౌండేషన్ పేరు రిజస్టర్ చేయబోతున్నాం. ఒక్కసారి అది పూర్తయిన తరవాత సవివరంగా ప్రకటిస్తాం. బహుశా… నెల రోజుల లోపు ఫౌండేషన్‌తో ప్రజల ముందుకి వస్తాం. ఫౌండేషన్ స్టార్ట్ చేయాలనేది నాన్నగారి (చిరంజీవి) ఐడియా. ప్రతి నెల మా పరిధిలో ఐదారుగురు అభిమానులకు సహాయం చేస్తున్నాం. కిడ్నీ సమస్యలు వున్నవారికి, క్యాన్సర్ పేషేంట్స్‌కి హెల్ప్ చేస్తున్నాం. దీన్ని నిర్మాణాత్మక పధ్ధతిలో చేయాలని ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మెడికల్ సమస్యలు వున్నవారికి సహాయం చేయడం కోసమే దీన్ని మొదలుపెడుతున్నాం. అభిమానులకు దీన్ని అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం. బ్రాండ్స్ నుంచి వచ్చే ఆదాయంలో 15 శాతం నుంచి 25 శాతం వరకూ ఫౌండేషన్‌కి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఈ సంగతి (రెమ్యునరేషన్లో కొంత ఛారిటీకి ఇచ్చే విషయం) చెప్పకూడదని అనుకున్నా. అందరికీ ఆదర్శంగా వుంటుందని చెబుతున్నా” అన్నారు.