ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేయడం కచ్చితంగా టాలీవుడ్లో కొత్త సంప్రదాయానికి నాంది పలికే విషయమే. ఈ సినిమా వల్లైనా.. హీరోలు ఎంత క్లోజ్ గా ఉంటారో అర్థమైంది. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య ఉన్న బాండింగ్ అభిమానులకు తెలిసొచ్చింది. ఎన్టీఆర్ తో దోస్తీ తన అదృష్టమని చరణ్ అంటే, చరణ్ లాంటి వ్యక్తిని ఇదివరకెప్పుడూ చూడలేదని ఎన్టీఆర్ కితాబిచ్చాడు. ఈ సినిమా చేయకముందు నుంచీ తామిద్దరూ మంచి ఫ్రెండ్సని వీరిద్దరూ చాలాసార్లు చెప్పారు. ఓ రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ ని కలిపే సినిమా ఇది. కానీ అది జరిగిందా..?
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా `ఆర్.ఆర్.ఆర్` విడుదలైంది. ఎక్కడ చూసినా.. `ఆర్.ఆర్.ఆర్` హడావుడే. థియేటర్లు తిరునాళ్లలా మారిపోయాయి. అభిమానం కూడా.. గేట్లు దాటేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇద్దరికీ ఎవరి ఫ్యాన్స్ బేస్ వాళ్లకుంది. ఆ అభిమానులు ఇప్పుడు పై చేయి కోసం ఆరాటపడుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఉదయం మూడున్నరకు ఆర్.ఆర్.ఆర్ ప్రీమియర్ జరిగింది. ధియేటర్ అంతా చరణ్, ఎన్టీఆర్ అభిమానులుగా విడిపోయారు. `జై ఎన్టీఆర్` అని ఓ వర్గం.. `జై. జై చరణ్` అంటూ వర్గం నినాదాలతో హోరెత్తించారు. రెండు ధియేటర్లు కేవలం చరణ్ ఫ్యాన్స్ తో నడిచాయి. ఇంకో రెండు ధియేటర్ల టికెట్లు మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్నారు. కూకట్ పల్లి బ్రమరాంబ, మల్లిఖార్జున ధియేటర్ల దగ్గరైతే చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ల హంగామా నువ్వా నేనా అన్నట్టు సాగింది. తూ.గో జిల్లాలోని కొన్ని ధియేటర్లలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుందని సమాచారం. `మా హీరో ఎక్కువ అంటే… మా హీరో ఎక్కువ` అని ఓవర్గం… `మా హీరో కటౌట్ పెద్దదంటే…. మా హీరో కటౌట్ పెద్దది` అని మరోవర్గం.. ఇలా ఎవరికి తోచిన దారిలో వాళ్లు తమ ఆధిపత్య ప్రదర్శన చేసే కార్యక్రమంలో పడిపోయారు. ఇద్దరు హీరోలు స్నేహితులుగా మారి, సినిమా చేస్తే… అభిమానులూ ఆ గౌరవాన్ని, స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. అప్పుడే అందం. ఆనందం. ఈ విషయాన్ని కొంతమంది దురాభిమానులు మర్చిపోవడం శోచనీయం.