పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. టాలీవుడ్ లో జెండా ఎగరేసినంతగా… మిగిలిన భాషల్లో ప్రతాపం చూపకపోవొచ్చు. ఎవరి టెస్టులు వారివి. తెలుగు నుంచి ఓ హీరో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. ఇప్పటికైతే టాలీవుడ్ లో ఉన్న ఏకైక పాన్ ఇండియా స్టార్…ప్రభాస్ మాత్రమే. అయితే ఆ దిశగా మరికొంతమంది అడుగులేస్తున్నారు. అందులో ఎంతమంది విజయం సాధిస్తారో తెలీదు గానీ – ప్రణాళికలైతే చాలానే ఉన్నాయి.
`ఆర్.ఆర్.ఆర్`తో ఎన్టీఆర్, చరణ్‌లకు పాన్ ఇండియా స్టార్లుగా మారే అవకాశం వచ్చింది. ఎందుకంటే… రాజమౌళి సినిమా అంటే ఆటోమెటిక్ గా పాన్ ఇండియా స్థాయి వచ్చేస్తుంది. `ఆర్.ఆర్.ఆర్` అన్ని భాషల్లోనలూ విడుదల అవుతుంది. `ఆర్.ఆర్.ఆర్`తో ఎన్టీఆర్, చరణ్‌లకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినట్టే. అయితే.. తదుపరి సినిమాలూ ఆ రేంజ్లో ఉండాలి. ఆ దిశగా చరణ్, ఎన్టీఆర్‌లు అడుగులేస్తున్నారు కూడా. చరణ్‌కి శంకర్ లాంటి దర్శకుడి అండ దొరికింది. శంకర్ సినిమా అంటే చెప్పేదేముంది? అది పాన్ ఇండియా స్థాయినే. పైగా. ఈ సినిమాకి మల్టీస్టారర్ లుక్ వచ్చేలా చూసుకుంటున్నాడు శంకర్. తమిళం నుంచో, బాలీవుడ్ నుంచో ఓ హీరోని దిగుమతి చేస్తున్నట్టు టాక్. హీరో ఎక్కడి వాడైనా సరే – మల్టీస్టారర్ అనగానే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. కాబట్టి… చరణ్ సరైన ప్రాజెక్టునే పట్టినట్టు లెక్క.
ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తో ఫిక్సయ్యింది. త్రివిక్రమ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇండ్రస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్. అయితే ఈసినిమాకి సైతం పాన్ ఇండియా లుక్ ఇవ్వాలన్నది ఎన్టీఆర్ ప్రయత్నం. అందుకు తగిన ప్రయత్నాలూ సాగుతున్నాయి. `ఆర్.ఆర్.ఆర్` తరవాత… తమ ఇమేజ్‌లో ఎలాంటి మార్పులొస్తాయో ఎన్టీఆర్, చరణ్‌లు ఊహించగలిగారు. దానికి తగ్గట్టే.. కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. `బాహుబలి` తరవాత ప్రభాస్ చేసింది అదే. `సాహో` అనే యాక్షన్ కథని ఎంచుకున్నాడు. ఇలాంటి కథలకు పాన్ ఇండియా పరంగా క్రేజ్ ఉంటుంది. కాబట్టి.. టాక్ అటూ ఇటుగా వచ్చినా వర్కవుట్ అయిపోయింది. దాని తరవాత… వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమాలే చేస్తున్నాడు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్‌లు కూడా అదే దారిని ఎంచుకున్నారు. ఇక మీదట వీరిద్దరి సినిమాలకు సైతం.. ఆటోమెటిగ్గా పాన్ ఇండియా ట్యాగ్ పడిపోవడం ఖాయం.