గీతాంజలి తరవాత నేరుగా తెలుగులో సినిమా చేయలేదు మణిరత్నం. నిజానికి మణి ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆయన తీసిన తమిళ సినిమాల్నే తెలుగులో డబ్ చేసుకొని చూసుకొన్నాం. అయితే.. గత కొంతకాలంగా ఓ తెలుగు సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. మహేష్‌బాబుకి ఓ కథ చెప్పినా వర్కవుట్ కాలేదు. కొంతకాలం నాగార్జునతో ఓ సినిమా చేద్దామనుకొన్నారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఫిక్సయ్యారు. చరణ్ కి కూడా మణిరత్నం తో సినిమా చేయాలని చాలా ఆశగా ఉంది. దాంతో.. ఈ ప్రాజెక్టు ఓకే అయిపోయింది. గతేడాది నుంచి చరణ్ – మణి సినిమాపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమా అధికారికంగా ఓకే అయిపోయింది. ఈ యేడాది జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని తెలుస్తోంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు చరణ్. జులైలో షూటింగ్ పూర్తయిపోతుంది. అంతకంటే ముందే.. అంటే జూన్‌లో మణిరత్నం సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో చరణ్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ తరహా పాత్ర చేయడం చరణ్‌కి ఇదే తొలిసారి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో తెరకెక్కిస్తారు. మణిరత్నం సినిమా అంటే బాలీవుడ్‌లోనూ క్రేజే. అందుకే ఈ సినిమా హిందీలో డబ్ అయ్యే అవకాశాలున్నాయి. స్టోరీ ఆల్రెడీ లాక్ చేసేశారని, కార్తీతో తెరకెక్కిస్తున్న చెలియా పనులు పూర్తవ్వగానే… చరణ్ సినిమా పనులు మొదలైపోతాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.