మెగా ఫ్యామిలీలో కాస్త వైవిధ్యభరితమైన కథల్ని ఎంచుకుంటున్న కథానాయకుడు వరుణ్ తేజ్ అనే చెప్పాలి. ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ… ఇలా ఏ కథకూ, మరో కథతో లింకు ఉండదు. ఇప్పుడు ‘అంతరిక్షం’తో తన ఫార్ములా కొనసాగిస్తున్నాడు. వరుణ్ కథల ఎంపిక చాలా బాగుంటుందని పరిశ్రమలో హీరోలు, దర్శకులు, కథానాయికలు చెబుతుంటారు. ఇప్పుడు చరణ్ కూడా అదే మాట అంటున్నాడు. ‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా చరణ్ వరుణ్‌కి బోలెడన్ని కితాబులు ఇచ్చాడు.
”వరుణ్ నన్ను చాలాసార్లు ఆశ్చర్యపరుస్తుంటాడు. కొన్ని సార్లు అసూయ కూడా కలుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి వరుణ్‌పై చాలా అసూయ పడ్డాను. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలో అవకాశం రాదు. తన అంకితభావం, ఆలోచన తీరే.. ఇందుకు కారణం. ఆలోచనే ఇష్టమైన వ్యక్తుల్ని, సినిమాల్ని దగ్గరకు చేరుస్తుంది. పాజిటీవ్ గా ఆలోచించే ప్రతి ఒక్కరికీ దేవుడు మంచే చేస్తాడు” అన్నాడు చరణ్.