మాస్ ఆడియన్స్ ను కట్టిపడేసే హీరో రామ్ చరణ్. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడు వీరిద్దరూ జతకట్టారు. రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి ఈ రోజు క్లాప్ పడింది. ఈ చిత్ర పూజా కార్యక్రమం కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయంలో జరిగింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం రామ్‌చరణ్, సుకుమార్ ‘రంగస్థలం’ షూటింగ్ తో బిజీగా వున్నాడు. 2018 మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రంగస్థలం తర్వాత చరణ్, కొరటాల శివతో జతకడతాడని అనుకున్నారు. ఈ సినిమాపై గతంలో చర్చలు కూడా జరిగాయి. అయితే చరణ్ మాత్రం మొదట బోయపాటి సినిమావైపే మొగ్గచూపాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖారారు కాలేదు.