రంగస్థలం తరవాత రామ్‌చరణ్ ప్రాజెక్ట్ బోయపాటి శ్రీనుతో అనేది తెలిసిన విషయమే. ఈ కాంబో గురించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకువచ్చింది. ఈ కథ రాజస్థాన్ నేపథ్యంలో జరగబోతోంది. దాదాపు 70 శాతం షూటింగ్ రాజస్థాన్‌లోనే చేస్తారు. మిగిలిన 30 శాతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించి.. రెండింటికీ మ్యాచ్ చేస్తారు. అంటే..కథ మొత్తం రాజస్థాన్ చుట్టూనే తిరుగుతుందన్నమాట. బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ ప్యాకేజీ. ఇది కూడా అంతే. కాకపోతే… రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా ‘ఓ సరికొత్త పాయింట్’తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఆ పాయింట్ నచ్చే.. చరణ్, చిరంజీవి ఈ సినిమాకి పచ్చజెండా ఊపారు.
బోయపాటి సినిమాల్లో కథానాయకుడి పాత్రకు రెండు కోణాలుంటాయి. ఈ సినిమాలోనూ బోయపాటి అదే స్టైల్లోవెళ్లబోతున్నాడని తెలుస్తోంది. ఓ గెటప్‌లో చరణ్ లుక్ అనూహ్యంగా ఉండబోతోందని.. అందుకోసం చరణ్ చాలా శ్రమించాల్సి ఉంటుందని సమాచారం. ప్రతినాయకుడి పాత్రలో వివేక్ ఓబెరాయ్ కనిపించబోతున్నాడు. హీరో, విలన్ కాకుండా మరో రెండు కీలకమైన పాత్రలున్నాయని, అందులోనూ పేరున్న నటీనటులే కనిపిస్తారని తెలుస్తోంది. అను ఇమ్మానియేల్‌ని కథానాయికగా ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.