బోయపాటి శ్రీను… కాస్త మిస్టర్ పర్ఫెక్ట్ టైపు. క్వాలిటీ విషయంలో రాజీ పడడు. తాను అనుకున్నది అనుకున్నట్టు వచ్చేంత వరకూ చెక్కుతూనే ఉంటాడు. కాబట్టి బోయపాటి సినిమా అంటే కనీసం 9 నెలలైనా ఖాయంగా గడిచిపోతాయి. అనుకున్న సమయానికి సినిమా తీసుకురావడం కూడా కాస్త కష్టంగానే కనిపిస్తుంటుంది. రామ్చరణ్ సినిమా కూడా బోయపాటి `చెక్కుడు` వల్ల ఆలస్యం అవుతుందేమో అనుకున్నారంతా. జనవరి 11న ఈ సినిమా విడుదల చేయాల్సివుంది. ఆ సమయానికి చరణ్ సినిమా వస్తుందా, రాదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయంలో క్లారిటీగానే ఉంది. జనవరి 11న ఈ సినిమా కచ్చితంగా విడుదల చేస్తామని చెబుతోంది.
2 పాటలు, 10 రోజుల టాకీ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆ రెండు పాటల్నీ రికార్డ్ చేసేశారు. తెరకెక్కించడమే తరువాయి. నవంబరు చివరికల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని భావిస్తోంది చిత్రబృందం. డిసెంబరులో ప్రమోషన్లు మొదలెట్టి, సంక్రాంతికి విడుదల చేయాలన్నది వ్యూహం. సంక్రాంతికి బాలయ్య `ఎన్టీఆర్` కూడా వస్తోంది. దాని ముందు నిలబడాలంటే.. ప్రమోషన్లు భారీ ఎత్తున చేయాలి. అందుకే వీలైనంత సమయం చేతిలో ఉంచుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. నవంబరు చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్నది డెడ్ లైన్. దానికి తగ్గట్టే ఏర్పాట్లూ జరుగుతున్నాయని టాక్.