ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చరణ్ కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం సమాయాత్తం అవుతోంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం బయటకు రాలేదు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్‌ని రివీల్ చేద్దామనుకొంటున్నారు. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన కట్ కూడా పూర్తయ్యింది. ఎడిట్ వెర్షన్ కొంతమంది చూశారు. చూసినవాళ్లంతా ‘నెక్ట్స్ లెవల్’ అంటూ కితాబులు ఇస్తున్నారు. గ్లింప్స్ మామూలుగా లేదని, చరణ్ అభిమానులు చొక్కాలు చించుకొనే రేంజ్లో గ్లింప్స్ కట్ చేశారని తెలుస్తోంది.
పుట్టిన రోజున చరణ్ హైదరాబాద్ లో ఉండడం లేదని, ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు వెళ్తున్నారని సమాచారం అందుతోంది. ‘గేమ్ ఛేంజర్’ తరవాత.. చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ‘గేమ్ ఛేంజర్’తో చరణ్ కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ సినిమా ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచింది. వాళ్లందరికీ సమాధానం చెప్పేలా బుచ్చిబాబు గ్లింప్స్ డిజైన్ చేశార్ట. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయిక. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే పిరియాడిక్ డ్రామా ఇది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. క్రికెటర్ ఎం.ఎస్.థోనీ అతిథి పాత్రలో నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.