రామ్‌చరణ్ తన కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఇందులో చరణ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో రానుంది. ఆయన అప్పన్నగా కనిపించనున్నాడు. అప్పన్నగా చరణ్ ఆహార్యం, అభినయం కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ‘రంగస్థలం’ చరణ్‌కు చెవుడు. ఈ ‘గేమ్ ఛేంజర్’లో అప్పన్న పాత్రకు నత్తి. కొడుకు పాత్రలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చందన్‌గా తెరపై దర్శనమివ్వనున్నాడు. అప్పన్న – రామ్ నందన్ పాత్రల మధ్య వైవిధ్యం కనిపిస్తుందని, రెండు పాత్రల్లోనూ చరణ్ ఇమిడిపోయాడని చిత్రబృందం చెబుతోంది. అప్పన్న ఆశయం కోసం తనయుడు ఏం చేశాడు? తండ్రికి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడన్నది కథ.
ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. శనివారం నుంచి చరణ్ సెట్లో అడుగుపెట్టాడు. కీలకమైన ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం ముగుస్తుంది. అంజలి, సునీల్, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. మరో సింగిల్ త్వరలోనే విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘ఇండియన్ 2’ విడుదలైన తరవాత ‘గేమ్ ఛేంజర్’ ప్రచారం మరింత ముమ్మరం చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు సమాచారం.