మన తెలుగు దర్శకులపై బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ కొరియన్ సినిమా చూడడం.. దాన్ని పట్టుకుని లైన్ తయారు చేసేయడం నవతరం దర్శకులు కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే.. ‘కథ ఏమైనా ఉందా’ అని అడిగితే.. ‘ఇదిగో ఈ డీవీడీ చూడండి’ అంటూ చేతికి ఓ ఇంగ్లిష్ సినిమా సీడీ ఇచ్చేంత వరకూ వెళ్లింది. చిన్నా, చితకా హీరోలే కాదు, ఇప్పుడు ఓ రేంజున్న స్టార్ హీరోలు కూడా ఈ డీవీడీలకు బాసినసలే. కానీ.. రామ్ చరణ్ మాత్రం ‘ఇలాంటి దర్శకులకు నేను దూరంగా ఉంటా’ అంటున్నాడు.
”కొంతమంది డీవీడీలు తీసుకొచ్చి సినిమా చూడండి.. దీంతో ఓ స్టోరీ అల్లేద్దాం అంటుంటారు. అలాంటి వాళ్లతో నేను కలవను.. మాట్లాడను. మనం ఎలాంటి సినిమా చేయాలి అనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉండాలి. మనకు నచ్చిన దారిలో వెళ్లాలి. మనపై మన ప్రభావమే ఉండాలి.. వాళ్లెవరో ఏదో చేస్తున్నారు, మనం కూడా అదే చేయాలి.. అనే ధోరణిలో ఆలోచించకూడదు” అంటున్నాడు చరణ్. డీవీడీలను నమ్ముకుంటూ సినిమాలు తీసేవాళ్లకు చరణ్ గట్టి కౌంటరే ఇచ్చినట్టు. ఇకమీదట చరణ్ దగ్గరకు వెళ్లే దర్శకులెవరైనా సరే – ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.