‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ తో 2025 ప్రారంభమైంది. ఈ సినిమాతో దిల్ రాజు ఎంత నష్టపోయారన్న లెక్కలు తేలుతున్నాయి. కనీసం అటూ ఇటుగా రూ.120 కోట్లయినా పోవడం ఖాయమన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న అంకె. సాధారణంగా ఇలాంటి భారీ డిజాస్టర్ తరవాత నిర్మాతల్ని ఆదుకోవడానికి సదరు హీరో, దర్శకుడు ముందుకొస్తారు. ‘మరో సినిమా తీసి పెడతాం’ అని మాట ఇస్తారు. శంకర్‌తో దిల్ రాజు మళ్లీ ఆ తప్పు చేయడు. ఇక మిగిలింది చరణ్ మాత్రమే. ‘గేమ్ చేంజర్’ రిలీజైన తరవాత చరణ్ దిల్ రాజుకు అభయహస్తం అందించాడని, ‘మీ బ్యానర్లో మరో సినిమా చేస్తా’ అని భరోసా అందించాడని చెప్పుకొన్నారు. దిల్‌రాజు కూడా చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేసేపనిలో ఉన్నాడని, ఈ సినిమాతో నష్టాల్ని భర్తీ చేద్దామని భావిస్తున్నాడని వార్తలొచ్చాయి.
అయితే అవన్నీ నిరాధారమైనవే అని చరణ్ పీ.ఆర్ టీమ్ కొట్టిపారేసింది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడని, ఆ తరవాత సుకుమార్ సినిమా ఉంటుందని, ఇవి మినహా చరణ్ కొత్త సినిమాలేం ఒప్పుకోలేదని, మీడియాలో వస్తున్న వార్తలేం నిజం కావని క్లారిటీ ఇచ్చేసింది. బుచ్చిబాబు సినిమాతో 2025 గడిచిపోతుంది. సుకుమార్ సినిమా అంటే కనీసం 2 ఏళ్ల సమయం తీసుకోవాలి. అంటే.. 2027 వరకూ చరణ్ ఖాళీగా ఉండడు. ఆ తరవాత రాజెవరో, మంత్రెవరో?! దిల్‌రాజు కూడా తన సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి, తనకు మరో సినిమా చేసి పెట్టమని హీరోల వెంట తిరిగే రకం కాదు. తనకు తాత్కాలిక ప్రయోజనాలకంటే శాశ్వత ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి. ఈ సినిమాతో పోతే, మరో సినిమాతో రాబట్టుకోవడం ఎలా? అని చూస్తారు. అంతే. గేమ్ చేంజర్ నష్టాల్ని ఆయనకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ భర్తీ చేసింది. కాబట్టి ఆయనకు ఆ సమస్య కూడా లేనట్టే.