ఉప్పెన ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చాడు. తనే వైష్ణవ్ తేజ్. ఉప్పెన సూపర్ హిట్ అవ్వడంతో… రాజమండ్రిలో.. సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తేజ్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ ని పొగడ్తలతో ముంచేశాడు. వైష్ణవ్ బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నా, లోపల ఓ విస్పోటనం దాగుందని, ఈ కుర్రాడిపై ఓ కన్నేసి ఉంచాలని…. సరదాగా వ్యాఖ్యానించాడు. తనకు వైష్ణవ్ లా నటించడానికి ఏడెనిమిది సినిమాల సమయం పట్టిందని, కానీ… తొలి సినిమాకే వైష్ణవ్ మెచ్యూరిటీ చూపించాడని కొనియాడాడు. తొలి సినిమా హీరోకి ఇన్ని కలక్షన్లు దొరకడం నిజంగా ఓ అరుదైన విషయమని, ఇది గ్రేట్ డెబ్యూ అని కితాబు ఇచ్చాడు.
“వైష్ణవ్ మా కంటే భిన్నంగా ఆలోచిస్తాడు. సెటిల్డ్ గా ఉంటాడు. అందుకే తాను ఈ సక్సెస్ కొట్టడంలో నాకు వింతేం కనిపించడం లేదు. తనలో డెడికేషన్ చూసే.. పవన్ కల్యాణ్ బాబాయ్ వైష్ణవ్ కు ట్రైనింగ్ ఇప్పించారు. మానాన్నగారు ఈ కథని 4 సార్లు విన్నారు. నా సినిమా కోసం కూడా అంత సమయం వెచ్చించి ఉండరు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు మా చుట్టూ ఉండడం మా అదృష్టం” అన్నాడు చరణ్. కరోనా కారణంగా 2020 పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని, ఈ దశలో.. మళ్లీ కోలుకున్న ఏకైక ఇండ్రస్ట్రీ.. సినిమా పరిశ్రమ అని, ఇదంతా తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు చరణ్.