తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలోనూ, ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలోనూ రాజమౌళిని మించిన వాళ్లు ఎవరూ ఉండరు. బాహుబలి కానివ్వండి, ఆర్.ఆర్.ఆర్ కానివ్వండి.. పైసా ఖర్చు లేకుండా ప్రమోట్ చేసుకోగలిగాడు రాజమౌళి. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ గురించి మాట్లాడుకొంటున్నారంటే.. అదంతా రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీనే. రాజమౌళి ఏ సినిమా చేసినా, ఎవరితో చేసినా.. రాజమౌళికి తప్ప ఇంకెవ్వరికీ పేరు రాదు. అది బహిరంగ రహస్యమే. అయితే.. బాహుబలితో… ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ అయిపోయాడు. అందుకోసం ప్రభాస్ కూడా చేసిందేం లేదు. ఇప్పట్లో ఆర్.ఆర్.ఆర్ టీమ్ చేస్తున్నట్టు.. బాహుబలి టైమ్‌లో అంతర్జాతీయంగా ఈ సినిమాకి ప్రచారం చేసుకోలేదు. అదంతా అసంకల్పితంగా వచ్చిన పబ్లిసిటీ మాత్రమే. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు వినిపించింది.
ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలో రాజమౌళి గురించి ఎంత మాట్లాడుకొంటున్నారో.. చరణ్, ఎన్టీఆర్‌ల గురించి కూడా అంతే మాట్లాడుకొంటున్నారు. దానికి కారణం.. `నాటు.. నాటు` పాట. ఈ పాట గ్లోబల్‌గా మంచి పాపులర్ అయిపోయింది. ఆ పాటలో కనిపించేది ఎన్టీఆర్,చరణ్‌లే కాబట్టి.. ఈజీగా పాపులారిటీ వచ్చేసింది. ఎప్పుడూ లేనిది… చరణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలెట్టాడు. అమెరికాలో పర్యటిస్తూ, అక్కడ అవార్డు ఫంక్షన్లలో పాల్గొంటూ, గుడ్ మార్నింగ్ అమెరికా లాంటి కార్యక్రమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ… ఆర్.ఆర్.ఆర్ తో సంపాదించుకొన్న ఇమేజ్‌ని రెట్టింపు చేసుకొంటున్నాడు. ఇది వరకు ఏ రాజమౌళి హీరో చేయని… పని ఇది. ఈ విషయంలో అందరికంటే.. ఎక్కువ మార్కులు తెచ్చుకొన్నాడు. అమెరికాలో చరణ్ ఎక్కడికి వెళ్లినా అపూర్వమైన స్వాగతం లభిస్తోంది. హాలీవుడ్ స్టార్లు అతన్ని గుర్తు పడుతున్నారు. మీడియా కూడా చరణ్‌పై బాగా ఫోకస్ చేసింది. ఎన్టీఆర్ తన వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లలేకపోయాడు. లేకుంటే ఇదే స్పందన.. ఎన్టీఆర్‌కీ వచ్చేది. ఆర్.ఆర్,ఆర్ క్రెడిట్ పూర్తిగా రాజమౌళికి వెళ్లకుండా… తన కష్టానికి తగిన ప్రతిఫలం రాబట్టుకోవడంలో చరణ్ సక్సెస్ అయ్యాడు. చరణ్ తరువాతి సినిమాలకు ఈ ఇమేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రేపు రాబోయే.. శంకర్ సినిమాకి ఈ క్రేజ్ బోనస్ గా మారడం ఖాయం.