హైదరాబాద్: చిరంజీవి 150వ చిత్రంనుంచి దర్శకుడు పూరి జగన్నాథ్ తప్పుకుంటున్నారని, వినాయక్‌కు ఆ ప్రాజెక్టు అప్పగిస్తున్నారని ఇటీవల మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాంచరణ్ ఇవాళ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పూరిని దర్శకుడిగా తీసుకున్నట్లు తాను చెప్పినమాట నిజమేనని అన్నారు. పూరి చెప్పిన కథలో ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ కూడా కుదిరితే ప్రాజెక్ట్ ముందుకెళుతుందని అన్నారు. ఈ విషయంలో నిర్ణయం చిరంజీవే తీసుకుంటారని, కథ ముఖ్యమని, మంచికథ ఎవరు తీసుకొస్తే వారితో ప్రారంభిస్తామని అన్నారు. పూరి కథతో చేస్తే ఆ చిత్రం పేరు ఆటో జానీ అవుతుందని చెప్పారు. పూరి ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాతో బిజీగా ఉన్నారని, దానిగురించి తానేమీ మాట్లాడబోనని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై వినాయక్కూడా ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తాను హీరోగా నటించే చిత్రం వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభమవుతుందని తెలిపారు. గబ్బర్ సింగ్ చిత్రం పూర్తయిన తర్వాత ఆ చిత్రం ఉంటుందని చెప్పారు. బాహుబలి చిత్రాన్ని ఇంకా తాను చూడలేదని, చూడాలని తెలిపారు. రాంచరణ్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న టర్బోమేఘ ఎయిర్‌లైన్స్ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో చరణ్ ఇవాళ ఈ విషయాలను వెల్లడించారు. ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు అన్నీ వచ్చేశాయని, ఈనెల 12నుంచి ట్రూజెట్ విమాన సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తామని, పుష్కరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పారు. సీనియర్ సిటిజన్స్‌కు, దక్షిణాది సినీ పరిశ్రమ, ‘మా’ సభ్యులకు టికెట్లలో 10 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్ళలో సంస్థ విస్తరణ చేపడతామని చరణ్ చెప్పారు.