రామ్ చరణ్ దగ్గర ‘జనసేన’ ప్రస్థావన ఎప్పుడు వచ్చినా ‘నేను బాబాయ్ వెంటే ఉన్నా..’ అని గట్టిగా చెప్పేవాడు. ఒకవేళ మెగా కాంపౌండ్ నుంచి… జనసేన వైపుకు హీరోలు కదిలి వస్తే.. తొలి అడుగు రామ్ చరణ్‌దే పడుతుందని పవన్ అభిమానుల గట్టి నమ్మకం. బ్రూస్లీ విడుదలకు ముందు చిరంజీవి – పవన్‌ల మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్‌ని దూరం చేసింది చరణే. రంగస్థలం సక్సెస్ మీట్లోనూ.. పవన్ కల్యాణ్ – చరణ్‌ల మధ్య అనుబంధం ప్రస్పుటమైంది. జనసేన తరపున రామ్ చరణ్ ప్రచారం చేయడం ఖాయమని ఆ రోజుల్లోనే గట్టిగా నమ్మారు మెగా ఫ్యాన్స్.
అయితే ఎన్నికలకు ఇంకా వారం రోజుల గడువు కూడా లేదు. మెగా హీరోల నుంచి ఎలాంటి అలికిడీ వినిపించడం లేదు. వాళ్లొచ్చే ఛాన్స్ నూటికి నూరు శాతం లేనట్టే. ఇంతకాలం బాబాయ్‌పై ప్రేమ ఒలకబోసిన చరణ్.. ఎన్నికల సమయంలో బాబాయ్ వెంట లేకపోవడం నిజంగానే పవన్ అభిమానులకు నచ్చడం లేదు. చరణ్, బన్నీలాంటి వాళ్లు వచ్చి ప్రచారం చేస్తే… జనసేన గెలుపు ఓటముల నిష్ఫత్తిలో అనూహ్యమైన మార్పులేం ఉండవు. కనీసం ‘మెగా హీరోలంతా ఒక్కటే’ అనే మన్మకం అయితే ఫ్యాన్స్‌కి కలుగుతుంది. ఆ అవకాశాన్ని చరణ్‌తో సహా మెగా హీరోలంతా జార విడచుకున్నారు. ఎన్నికల సమయంలో బాబాయ్వెంట ఎందుకు లేరు..? అని చరణ్‌ని అడిగితే బహుశా.. ‘గాయం’ని కారణంగా చూపించే అవకాశాలున్నాయి. ఆర్.ఆర్.ఆర్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ… చరణ్ గాయ పడడం, షూటింగ్‌ని మూడు వారాల పాటు వాయిదా వేయడం తెలిసిన విషయాలే. చరణ్‌కి ఇదో సాకుగా మారే అవకాశాలున్నాయి.
కీలకమైన ఎన్నికల సీజన్లో షూటింగ్‌లు పెట్టుకోవడంతోనే చరణ్ ‘జనసేన’ ప్రచారాన్ని లైట్‌గా తీసుకున్నాడన్నవిషయం అర్థమవుతూ ఉంది. గాయపడడం వల్లే షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఎన్నికలు జరుగున్నప్పుడు పూణెలో చరణ్ షూటింగ్లో బిజీగా ఉండేవాడు. సో.. చరణ్ ఈ కారణం చెప్పినా ఫ్యాన్స్ నమ్మే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న పొజీషన్లో జనసేన ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు లేవు. ఏ సర్వే చూసినా జనసేనకు సింగిల్ డిజిట్లో స్థానాలు వస్తాయనే చెబుతున్నాయి. ఈ మాత్రం దానికి కాంపెనియంగ్ చేయడం ఎందుకు అని చరణ్‌తో సహా మిగిలిన మెగా హీరోలు లైట్ తీసుకున్నట్టున్నారు. మరి రేపు తమ సినిమా ప్రచారం కోసం పవన్ గుర్తొస్తే… వాళ్లంతా పవన్‌ని వెదుక్కుంటూ రాగలరా? పవన్ మనస్ఫూర్తిగా ఆ ప్రచారానికి వెళ్లగలడా? వెళ్లినా పవన్ ఫ్యాన్స్ హర్షిస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానాలు చెప్పాలి.