మెగా పవర్ స్టార్ రాం చరణ్ బ్రూస్ లీ తర్వాత నాలుగు నెలలు గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్ సినిమాకు రెడీ అయ్యాడు. అయితే ఫిబ్రవరి 22న మొదలు పెట్టిన ఈ సినిమా చిత్రీకరణలో ఇప్పటి దాకా చరణ్ పాల్గొనలేదట. మొదటి షెడ్యూల్ మొత్తం చెర్రి లేకుండానే కానిచ్చేసిన చిత్ర యూనిట్ మార్చ్ 14న మొదలయ్యే రెండో షెడ్యూల్ లో చరణ్ పాల్గొననున్నాడని తెలుస్తుంది.
సినిమాలో హీరో పోలీస్ పాత్ర కావడం చేత న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్న చరణ్ రాబోతున్న ఈ సినిమాలో న్యూ మేకోవర్ తో దర్శనమిస్తాడట. స్టైలిష్ హీరోగా కనిపిస్తూ విలన్ ల బరతం పడతాడట. ప్రస్తుతం టైటిల్ ఇంకా ఫైనల్ అవ్వని ఈ సినిమాకు ధృవ అంటూ ప్రచారం జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
90 వర్కింగ్ డేస్ లో సినిమా మొత్తం పూర్తి చేసి ఆగష్టు కల్లా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. తమిళ్ లో ట్రెండ్ సెట్ సినిమా వంద కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి సంచలన విజయం దక్కించుకుంటుందో చూడాలి.