“ఎంతమంది థియేటర్లకు వచ్చి సినిమా చూశారనే దానికి డెఫినిషన్.. కలెక్షన్స్. ఎక్కడికి వెళ్లినా పదిమంది మీ సినిమా బాగుందని చెప్పడంలో వున్న ఆనందం.. కచ్చితంగా నంబర్స్ (కలెక్షన్స్) ఇవ్వదు. మా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి కానీ… నేను నటించే సినిమా నిర్మాణ సంస్థల నుంచి కానీ… అధికారికంగా లెక్కలు (సినిమా వసూళ్లు) బయటకు రావు. ఎందుకంటే… కలెక్షన్స్‌తో లేనిపోని కాంట్రవర్సీలు వస్తున్నాయ్. హీరోలంతా వెరీ గుడ్ ఫ్రెండ్స్. అభిమానులు కూడా అంతే ఫ్రెండ్లీగా వుండాలని కోరుకుంటున్నాం. హెల్దీ కాంపిటీషన్ వుండాలని కోరుకుంటున్నాం. అది నిజం కావాలంటే… యాక్టర్లుగా మేమంతా (హీరోలు) పోస్టర్ల మీద లెక్కలు వేసే ధోరణి నుంచి వెనకడుగు వేయాలి” – ‘రంగస్థలం’ రెండొందల కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించగా… రామ్‌చరణ్ చెప్పిన సమాధానమిది.
“సినిమా వసూళ్లు, నిర్మాతలు ప్రకటిస్తున్న లెక్కల పట్ల ప్రేక్షకుల స్పందిస్తున్న తీరు సరిగ్గా లేదు” అని చరణ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మా సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే… మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని నిర్మాతలు పోటాపోటీగా వసూళ్ల లెక్కలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల లెక్కలపై ప్రేక్షకుల్లో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
“ఎవరైనా వున్నది వున్నట్టుగా సరైన లెక్కలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు, ప్రేక్షకులు ఏ విధంగా తీసుకుంటారనేది మా చేతుల్లో లేదు. ఈ వసూళ్ల లెక్కలు చెప్పడం వల్ల కొన్నిసార్లు ప్రేక్షకుల్లో లేని ఫీలింగ్ తీసుకొస్తున్నామా? అనిపిస్తుంది. తప్పుగా ఉద్దేశించి చెప్పడం లేదు. మేము నిజాయితీగా అనుకునేది కొన్నిసార్లు ఎదుటివ్యక్తులు అపార్థం కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలని అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో నా నిర్మాతలను లెక్కలు ప్రకటించవద్దని రిక్వెస్ట్ చేస్తా. ఇకపై నా పోస్టర్ల మీద కలెక్షన్స్ లెక్కలు వేయవద్దని చెబుతా” అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.