ఏ హీరోకైనా రాజమౌళితో సినిమా చేయడం ఓ కల. ఫ్యాన్స్‌కు అది పండగ. అయితే.. లోలోపల ఓ భయం కూడా ఉంటుంది. రాజమౌళితో సినిమా ఫిక్సయితే, మినిమం మూడు నాలుగేళ్లు ఆ సినిమాకే అంకితం అయిపోవాలి. మరో ప్రాజెక్టు ఉండదు. రాజమౌళి చెప్పినట్టల్లా ఆడాలి. పండగలకు, పబ్బాలకూ ఫస్ట్ లుక్లూ, టీజర్లు అంటూ హడావుడి ఉండదు. వాటన్నింటికీ హీరోలూ సిద్ధమైపోతారు. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్సందరికీ సంబరమే. అయితే… మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ తో మహేష్ లాక్ అయిపోతాడన్న భయం వాళ్లలో వుంది. కాకపోతే.. ఇప్పుడు రామ్ చరణ్ మాటలు మహేష్ అభిమానుల చెవుల్లో అమృతం నింపాయి. ‘అన్నీ అనుకొన్నట్టు కుదిరితే.. ఏడాదిన్నరలో మహేష్ సినిమా వచ్చేస్తుంది’ అంటూ ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ఈవెంట్ లో జోస్యం చెప్పాడు చరణ్. తను తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో తెలీదు కానీ, ‘చరణ్ మాటలు నిజమైతే బాగుణ్ణు’ అని ఫ్యాన్స్ దండాలు పెట్టేసుకొంటున్నారు.
చరణ్ మాటలు అంత లైట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజమౌళి ప్లానింగ్ గురించి చరణ్‌కు బాగా తెలుసు. ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్లా’ మహేష్ సినిమా లేట్ కాకపోవొచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల మాట. ఈసారి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌కి చాలా టైమ్ కేటాయించారు. ప్రొడక్షన్ మాత్రం చక చక పూర్తి చేయాలన్నది ప్లాన్. నిజానికి లాక్ డౌన్ లేకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా చాలా త్వరగా పూర్తయ్యేది. కరోనా వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. రాజమౌళి ప్లాన్ కూడా 2026 చివర్లో మహేష్ సినిమాని విడుదల చేయడం గురించే. అయితే ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పడం లేదు. ఎందుకంటే ఓ రిలీజ్ డేట్ చెప్పడం, అది చేయి జారిపోవడం, మరో రిలీజ్ డేట్ ప్రకటించడం.. ఇలా కన్ఫ్యూజన్ సృష్టించడం జక్కన్నకు ఇష్టం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’కు రిలీజ్ డేట్లు చాలా మారాయి. ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదని జక్కన్న అనుకొంటున్నాడు.
దాంతో పాటు ఈ సినిమాకు వీలైనంత లో ప్రొఫైల్ కొనసాగించాలని జక్కన్న భావిస్తున్నాడు. అందుకే వేదికలపై ఎక్కడా ఈ సినిమా గురించి ప్రస్తావించడం లేదు. తాను ఏ సినిమా మొదలెట్టినా ఓ ప్రెస్ మీట్ పెట్టి కథేంటో చెప్పడం అలవాటు. ఈసారి అదీ లేనట్టే కనిపిస్తోంది. ఎందుంకంటే ఇప్పటికే ఈ సినిమాకు కొబ్బరికాయ్ కొట్టేశారు. రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టే పనుల్లో ఉన్నారు. ప్రెస్ మీట్ జాడ కనిపించడం లేదు. చూస్తుంటే రాజమౌళి ఈ సినిమా కోసం తన సెంటిమెంట్ పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది.